భారతీయ జనతా పార్టీతో గ్యాప్ ఉందని పవన్ కల్యాణ్ ప్రకటించిన తర్వాతి రోజే.. సోము వీర్రాజు హైదరాబాద్ వెళ్లి జనసేనానితో భేటీ అయ్యారు. గ్యాప్‌ను ఫిల్ చేసుకునేందుకు ప్రయత్నించారు. తిరుపతి లోక్‌సభ అభ్యర్థి విషయంలోనే ప్రధానంగా రెండు పార్టీల మధ్య గ్యాప్ వచ్చింది. గ్రేటర్ ఎన్నికల్లో త్యాగం చేసిన పవన్ కల్యాణ్.. తిరుపతి బరిలో మాత్రం జనసేన అభ్యర్థి ఉండాలని పట్టుదలగా ఉన్నారు. ఈ విషయంలో ఆయన ఎక్కడా తొందర పడకుండా మిత్రధర్మాన్ని పాటిస్తూ ఉమ్మడి అభ్యర్థి గురించి చెబుతూ వస్తున్నారు. అయితే.. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నేతలు మాత్రం చాలా దూకుడుగా ఉన్నారు. సోము వీర్రాజు అయితే తిరుపతి నుంచి బీజేపీ అభ్యర్థే ఉంటారని.. జనసేన మద్దతు ఇస్తుందని డిక్లేర్ చేసేశారు.
అంతే కాదు.. పవన్ కల్యాణ్ అందుకు ఒప్పుకున్నారని కూడా ప్రకటించారు. అంతకు ముందు జీవీఎల్ కూడా.. ఈ తరహా ప్రకటనలు చేశారు. దీనిపై జనసేన హైకమాండ్ అసంతృప్తితో ఉంది. తమ కార్యాచరణ ప్రకారం.. తాము ముందుకెళ్తోంది. ఈ క్రమంలో ఉమ్మడిగా పోటీ చేయాల్సిందేననన్న లక్ష్యంతో ఉన్న బీజేపీ.. పవన్ కల్యాణ్‌ను ఎలాగైనా ఒప్పించేందుకు ప్రయత్నిస్తోంది. అందుకే సోము వీర్రాజు..నేరుగా పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. అయితే ఇద్దరి చర్చల్లో అభ్యర్థి ఏ పార్ట ీఅన్నదానిపై స్పష్టత తెచ్చుకోలేదు కానీ.. ఎప్పటిలాగే.. ఉమ్మడి అభ్యర్థి ఉండాలన్న నిర్ణయానికి మాత్రం వచ్చారు.
2024లో బీజేపీ, జనసేన కలిసి అధికారంలోకి రావడమే లక్ష్యమని.. దీనికి తిరుపతి ఉప ఎన్నికనే పునాదిగా భావిస్తున్నామని సోము వీర్రాజు చెబుతున్నారు. ఇరు పార్టీల మధ్య సమన్వయ లోపం లేకుండా ముందుకెళ్తామని చెప్పుకొచ్చారు. సమన్వయం అంటే భారతీయ జనతా పార్టీ… జనసేన మొత్తం తమ వెనుకే ఉండాలని.. అన్ని చాన్సులు తమకే ఉండాలని.. సపోర్టర్లుగానే జనసేన ఉండాలని భావిస్తోంది. అయితే.. బీజేపీ కన్నా ఎక్కువ ఓటు బ్యాంక్ ఉన్న జనసేన … తమ బలాన్ని గుర్తించాలని అనుకుంటోంది.