అమరావతి రైతుల పాదయాత్రను ఇప్పటి వరకూ హేళన చేసిన ఏపీ బీజేపీ నేతలు ఇప్పుడు నేరుగా వారి పోరాటానికి మద్దతివ్వడానికి రంగంలోకి దిగుతున్నారు. 21వ తేదీన సోము వీర్రాజు నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధి బృందం రైతులను కలిసి సంఘిభావం ప్రకటించనుంది. వారితో పాటు కొంత దూరం పాదయాత్ర చేయనుంది. ప్రస్తుతం నెల్లూరు జిల్లాకు రైతుల పాదయాత్ర చేరుకుంది. నిన్నామొన్నటి వరకూ సోము వీర్రాజుతో పాటు మరికొంత మంది నోటితో మద్దతిచ్చి… అమరావతి రైతుల్ని నొసటితో వెక్కిరించేవారు.
విష్ణువర్ధన్ రెడ్డి వంటి వారు అమరావతి మహిళా రైతుల దుస్తుల మీద వ్యాఖ్యలు చేసేవారు. రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులనేవారు. అయితే తిరుపతిలో హోంమంత్రి అమిత్ షా క్లాస్ ఇచ్చిన తర్వాత సీన్ మారిపోయింది. వారు నేరుగా అమరావతికి మద్దతు ప్రకటిస్తున్నారు. నిజానికి పాదయాత్ర ప్రారంభం రోజున రావెల కిషోర్‌తో పాటు కొంత మంది బీజేపీ నేతలు సంఘిభావం చెప్పారు.
వారిపై ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ ధియోధర్ మండిపడ్డారు. ఫోన్ చేసి మండిపడ్డారన్న ప్రచారం జరిగింది. ఈ క్రమంలో బీజేపీ తీరుపై విమర్శలు ప్రారంభమయ్యాయి. అమిత్ షా సీరియస్‌గా చెప్పడంతో ఇక సోము వీర్రాజు అండ్ టీంకు కూడా తప్పడం లేదు. ఇప్పటికే అమరావతికి మద్దతుగా ఉన్న బీజేపీలోని ఓ వర్గంతో వీరు కలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.