ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అగ్రిగోల్డ్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని సీఎం జగన్కు లేఖ రాశారు. ఇంతవరకు ఎంతమంది సమస్యలు పరిష్కరించారో సీఎం జగన్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సీఎం జగన్.. ఆ హామీ ఇచ్చి మూడున్నర ఏళ్లు దాటినా ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించారు.
అగ్రిగోల్డ్ బాధితులను జగన్ నిట్ట నిలువునా ముంచారు. టీడీపీ హయాంలో ఆస్తులన్నీ జప్తు చేయించి వేలం వేయించే ప్రక్రియ చేపట్టారు. కానీ ఆస్తులన్నీ టీడీపీ నేతలు కొట్టేస్తున్నారని వేలాన్ని ఆపేయించారు. జీ సంస్థ ముందుకు వస్తే ఆరోపణలు చేయించి ఆ కంపెనీ వెనక్కి వెళ్లేలా చేశారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి బడ్జెట్లో పదిహేను వందల కోట్లు కేటాయించి అందరికీ న్యాయం చేస్తానన్నారు. బడ్జెట్లో నిధులు కేటాయించారు కానీ.. రూపాయి విడుదల చేయలేదు. టీడీపీ ప్రభుత్వం ఆస్తులు వేలం వేసి ఉంచిన డబ్బులను ఏడాదిన్నర తర్వాత రూ. 250 కోట్లు జమ చేశారు. ఆ తర్వాత ఇక పట్టించుకోలేదు.
అగ్రిగోల్డ్ బాధితులు లక్షల్లో ఉన్నారు. జగన్ ఏదో మేలు చేస్తారని ఆశించారు. వారంతా వైసీపీకో ఓట్లేశారు. వైసీపీ నేతలు గతంలో కొంత మంది ముందు ఉండి.. అగ్రిగోల్డ్ బాధితుల సంఘాలు ఏర్పాటు చేసి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇప్పుడు అందర్నీ నట్టేట ముంచి తాము మాత్రం పదవులు అనుభవిస్తున్నారు. ఇంత కాలం కమ్యూనిస్టులు ఈ అంశంపై స్పందించేవారు. ఇప్పుడు అనూహ్యంగా అగ్రిగోల్డ్ అంశాన్ని సోము వీర్రాజు ఎత్తుకున్నారు.