అక్టోబర్ 12నుండి మొదలయ్యే బీహార్ ఎన్నికలలో రాజకీయ పార్టీలకు అల్లుళ్ళతో కూడా పోరాడవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. జనతా పరివార్ కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ అల్లుడు తేజ్ ప్రతాప్ తన మావగారికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తాననిబెదిరిస్తున్నాడు. అలాగే ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న లోక్ జన శక్తి పార్టీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ అల్లుడు అనిల్ కుమార్ సాధు కూడా ఎన్నికలలో మావగారి పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని హెచ్చరిస్తున్నాడు.
వారిలో మెయిన్ పురి నియోజక వర్గానికి ఎంపీ అయిన తేజ్ ప్రతాప్, లాలూ ప్రసాద్ యాదవ్ కి అల్లుడయినప్పటికీ జనతా పరివార్ నుండి విడిపోయి ఒంటరిగా పోటీ చేస్తున్న సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మనుమడు. కనుక తను తాతగారి తరపునే ఎన్నికల ప్రచారం చేస్తానని చెపుతున్నాడు. ములాయం సింగ్ కూడా ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తుండటంతో ఆయన లాలూ ప్రసాద్ యాదవ్ కి చెందిన ఆర్జీడీ పార్టీని గట్టిగా డ్డీ కొనక తప్పదు. కనుక తేజ్ ప్రతాప్ మావగారి పార్టీతో యుద్దానికి సై అంటున్నాడు.
ఇక రామ్ విలాశ్ పాశ్వాన్ అల్లుడు అనిల్ కుమార్ సాధు కధ వేరే ఉంది. అతను ఇంతవరకు మావగారి పార్టీలోనే ఉన్నాడు. అతను తన కొడుక్కి టికెట్ ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేసాడు. కానీ రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని అతనికి టికెట్ ఇవ్వడానికి నిరాకరించడంతో అతను తిరుగుబాటు చేసాడు. దానితో అతనిని పాశ్వాన్ మావగారు పార్టీ నుండి ఆరేళ్ళపాటు బహిష్కరించారు. ఇప్పుడు అతను అతని కొడుకు వారి అనుచరులు అందరూ కూడా లోక్ జన శక్తి పార్టీకి వ్యతిరేకంగా ప్రచారానికి సిద్దం అవుతున్నారని తాజా సమాచారం.