పాన్ ఇండియా కలరింగ్ ఇవ్వడం ప్రతీ సినిమాకీ అత్యంత అవసరమైన విషయం అయిపోయింది. కథెలా ఉన్నా, పాన్ ఇండియా ఆర్టిస్టులతో ఆ సినిమాని నింపేయడం ప్రధాన కర్తవ్యం అవుతోంది. అగ్ర హీరోల సినిమాలకైతే.. మరీనూ. ఓ టాప్ హీరో సినిమా అనగానే హీరోయిన్ని బాలీవుడ్ నుంచి దిగుమతి చేయడం తప్పనిసరి నియమం. ఇప్పుడు చిరంజీవి కోసం కూడా బాలీవుడ్ హీరోయిన్ ని అన్వేషిస్తున్నారు.
`లవకుశ`, `వెంకీమామ` సినిమాలతో ఆకట్టుకున్నాడు..బాబి. తన దర్శకత్వంలో నటించడానికి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. బాబి ప్రస్తుతం స్క్రిప్టుకి పదును పెట్టే పనిలో ఉన్నాడు. మరోవైపు కథానాయిక అన్వేషణ కూడా మొదలైపోయింది. ఈసారి చిరు కోసం బాలీవుడ్ హీరోయిన్ ని దిగుమతి చేద్దామనుకుంటున్నారు. కథానాయికల లిస్టులో సోనాక్షి సిన్హా పేరు గట్టిగా వినిపిస్తోంది. చిరు కూడా సోనాక్షి అయితే ఓకే.. అని చెప్పేశాడట. ప్రస్తుతం సోనాక్షి టీమ్ తో బాబి మంతనాలు చేస్తున్నట్టు సమాచారం. `ఆచార్య` అవ్వగానే `లూసీఫర్` రీమేక్ మొదలెడతాడు చిరు. ఆ సినిమా అవ్వగానే బాబి సినిమా పట్టాలెక్కనుంది. సోనాక్షి గనుక ఓకే అంటే.. ఈ సినిమాకి పాన్ ఇండియా కలరింగ్ మొదలైపోయినట్టే.