బాహుబలి సినిమాలో కాలకేయ మాట్లాడిన భాష – `కిలికి’. నిజానికి ఇది భాషేకాదు. కేవలం సినిమా కోసం డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి ఈ భాషను తయారుచేయించారు. `కిలికి’ పేరిట కొత్త భాషను తయారుచేసే బాధ్యతను అప్పట్లో పాటలు రచయిత మదన్ కార్కీకి అప్పగించారు. అలా పుట్టుకొచ్చిన కిలికి భాష బాహుబలి సినిమాకే హైలైట్ అయింది. ఇప్పుడు ఈ భాషలో మొట్టమొదటిసారిగా ఓ పాట తయారైంది. దీనికి సంబంధించిన వీడియో ఆల్బమ్ ను బుధవారం (డిసెంబర్ 23) రిలీజ్ చేస్తున్నారు.
బాహుబలిలో ప్రవేశపెట్టిన కిలికి భాష పట్ల సినీగాయని స్మిత ఆకర్షితురాలైంది. దీంతో ఆమె `బాహా కిలికి’ పేరిట ఆల్బమ్ ని తయారుచేయించారు. బాహుబలిలో కిలికి భాషను రూపకల్పన చేసిన మదన్ కార్కీనే ఈ పాట కూడా రాశారు. కాలకేయ పాత్రపోషించిన ప్రభాకర్ తో పాటు స్మిత మీద ఈ పాటను చిత్రీకరించారు.
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఈ ఆల్బమ్ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. కిలికి భాషలో పాట, ఆట ఎలా ఉంటాయో చూడాలన్న ఆసక్తి పెరిగిపోయేలా స్మిత, రైటర్ మదన్ కార్కీ ట్విట్టర్ లో పోస్టింగ్స్ పెడుతున్నారు. కొంతకాలంగా స్మిత విరామం ప్రకటించిన తర్వాత ఈ ఆల్బమ్ తో మళ్ళీ ప్రేక్షకులముందుకు వస్తున్నారు. విజయవాడలో జన్మించిన వల్లూరుపల్లి స్మిత 1997లో `పాడుతాతీయగా’ కార్యక్రమం ద్వారా పాపులర్ అయింది. నేపథ్యగాయనిగా మారిన తర్వాత పాప్ సింగర్ గా అవతారమెత్తారు. `హాయిరబ్బా’ ఆల్బమ్ తర్వాత ఆమె తెలుగులో అనేక మ్యూజికల్ ఆల్బమ్స్ తయారుచేశారు. వాటిలో `మసక మసక’ కూడా ఒకటి. `అనుకోకుండా ఒక రోజు’ సినిమాలో స్మిత `ఎవరైనా చూసుంటారా..’ పాట కీరవాణి సంగీత దర్శకత్వంలో పాడారు. 2005లో ఈ పాటకు `ఫిల్మ్ ఫేర్’ అవార్డు దక్కింది. ఈమె రాజమౌళికి దూరపు చుట్టం.
కిలికి భాషను తయారుచేసిన మదన్ పాటల రచయితే కాకుండా డైలాగ్ రైటర్. వృత్తిరీత్యా సాప్ట్ వేర్ ఇంజనీర్. బాహుబలి తమిళ వర్షెన్ కు ఇతనే డైలాగ్ లు రాశారు. దీంతోపాటు కాలకేయ ట్రైబల్ లాంగ్వేజ్ (కిలికి) తయారుచేసి రాజమౌళికి అందించాడు.
కాలకేయ పాత్రలో జీవించిన నటుడు ప్రభాకర్ సంగతి మనందరికీ తెలిసిందే. క్రూరత్వం ఉట్టిపడేలా పాత్రలో లీనమైన ప్రభాకర్ ఇప్పుడు `బాహాకిలికి’లో స్మితతో కలసి ఏ రకంగా సందడి చేయబోతున్నాడో చూడాలి.
– కణ్వస