చిరంజీవి – అనిల్ రావిపూడి సినిమా ఉగాది సందర్భంగా లాంఛనంగా ప్రారంభమైంది. మే లేదా జూన్‌లో రెగ్యులర్ షూటింగ్ ఉండొచ్చు. ఈ సినిమా కోసం రావిపూడి చాలా పెద్ద ప్లానింగే వేస్తున్నాడు. కొత్త కొత్త ఆకర్షణల్ని చేరుస్తున్నాడు. ఈ సినిమా కోసం చిరంజీవి ఓ పాట పాడే అవకాశం ఉంది. చాలా కాలం తరవాత చిరు గొంతు సవరించుకోవడం అభిమానులకు స్పెషలే. వెంకటేష్ అతిథి పాత్రలో కనిపిస్తారన్న ప్రచారం జరుగుతోంది. నిజానికి వెంకీది అతిథి పాత్రేం కాదు. కాస్త నిడివి ఉన్న క్యారెక్టరే. వెంకీ కోసం ఓ పాట, ఓ ఫైట్ కూడా డిజైన్ చేస్తున్నారని తెలుస్తోంది. చిరు – వెంకీ ఓ పాటలో స్టెప్పులు వేస్తారని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇద్దరు అగ్ర హీరోలు కలిసి డాన్స్ చేస్తే, అంతకంటే కావాల్సింది ఏముంది?
ఈ సినిమాలో చిరు సెక్యురిటీ ఆఫీసర్ గా కనిపిస్తారని తెలుస్తోంది. హీరోయిన్‌కి సెక్యురిటీగా వెళ్తే.. అక్కడ ఏం జరిగిందన్నది కాన్సెప్ట్. సరిగ్గా ఇలాంటి పాయింటే ‘రాబిన్ హుడ్’లో ఉందనుకోండి. కాకపోతే… ఇక్కడ అనిల్ రావిపూడి వెర్షన్ వేరు. కథానాయికగా పరిణితీ చోప్రా పేరు పరిశీలనలో ఉంది. మృణాళ్ ఠాకూర్ పేరు కూడా చర్చల్లో గట్టిగా వినిపిస్తోంది. భీమ్స్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. మొత్తం 5 పాటలు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే 3 పాటల్ని రికార్డ్ చేసినట్టు సమాచారం. 2026 సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.