భారతీయ జనతా పార్టీలో నరేంద్రమోడీ, అమిత్ షా పేర్లు తప్ప.. ఇతరుల పేర్లు బయటకు వినిపించి, కనిపించి చాలా కాలం అవుతోంది. అయితే కొంత కాలం నుంచి మాత్రం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేరు బయటకు వస్తోంది. ఆయన కూడా.. మోడీ, షాలపై నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. దీంతో.. మోడీకి స్వపక్షంలో విపక్షం తయారయిందని… అంతా అనుకుంటున్నారు. అదే సమయంలో గడ్కరీ… బీజేపీని నడిపించే.. ఆరెస్సెస్ వర్గాలకు దత్తపుత్రుడు లాంటినేత కావడంతో.. ఈ ప్రచారం మరింత బలం పుంజుకుంది. గడ్కరీ ఆ నర్మగర్భ కామెంట్లను అలా కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ మరింత సమర్థంగా ఉపయోగించుకుని.. బీజేపీలో.. ముఖ్యనేతల మధ్య గ్యాప్ పెంచడానికి వాడేసుకుంటోంది.
గత వారం.. “కుటుంబాన్ని పట్టించుకోనోడు.. దేశాన్నేం పట్టించుకుంటాడంటూ..” ఆ అరెస్సెస్ మీటింగ్‌లో గడ్కరీ చేసిన వ్యాఖ్యలను.. రాహుల్ గాంధీ .. ప్రత్యేకంగా ప్రస్తావించారు. ట్విట్టర్లో బీజేపీలో ఉన్న ఒకే ఒక్క మగాడు గడ్కరీ అంటూ ప్రశంసలతో ముంచెత్తారు. ఇప్పుడు సోనియా వంతు వచ్చింది. నితిన్ గడ్కరీ పని తీరు సూపర్ అంటూ.. సోనియా.. నేరుగా చప్పట్లు కొట్టేసారు. లోక్‌సభలో తన పనితీరును.. అన్ని పార్టీల నేతలు ప్రశంసిస్తున్నారని చెప్పుకొచ్చారు. దానికి సోనియా ఆమోదం తెలుపుతూ.. బల్లలు చరిచారు. సోనియాను ఇతర కాంగ్రెస్ నేతలు ఫాలో అయ్యారు. ఉత్తరప్రదేశ్ లోని తన నియోజకవర్గంలో ఉన్న రహదారుల సమస్యపై సానుకూలంగా స్పందించారంటూ ధన్యవాదాలు తెలుపుతూ గడ్కరీకి గతంలో సోనియా లేఖ రాశారు.
ఓ వైపు నర్మగర్భ వ్యాఖ్యలను.. సూటిగా మోడీకి తగలేలా చేస్తూండటం.. పూర్తి మెజార్టీ రాకపోతే… మిత్రపక్షాలను కూడగట్టడానికి గడ్కరీనే ప్రధాని అభ్యర్థిగా తెర ముందుకు తెస్తారని జరుగుతున్న ప్రచారం నేపధ్యంలో.. ప్రస్తుత పరిణామాలు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. ఇది మోడీ, షాలకు ఎలా ఉంటుందో కానీ.. గడ్కరీలో మాత్రం అన్ని పార్టీల నేతలు.. బీజేపీ నుంచి ఓ పాజిటివ్ ఫేస్‌ను చూస్తున్నారు.