ఆ నాయకుడు ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉన్నారు. నిజానికి ఆ రాష్ట్రంలో అంతో ఇంతో ఓట్లు రాల్చుకోవాలంటే.. ఆ నేత ప్రచారం చాలా అవసరం. కానీ కాంగ్రెస్ పార్టీకి అంతకంటె పెద్ద అవసరం మరొకటి కూడా ఉన్నది. ఒక రాష్ట్రంలో ఎన్నికల్లో సీట్లు దక్కించుకోవడానికంటె ముఖ్యంగా ‘అమ్మ’ను కాపాడుకోవడం వారికి ముఖ్యం. అందుకే ఆయన ఎన్నికలను వాటి ఖర్మకు వాటిని వదిలేసి.. హుటాహుటిన ఢిల్లీ చేరుకున్నారు.
అవును మరి! కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అన్నింటికంటె పెద్ద ప్రయారిటీ అంశం ఏదైనా ఉన్నదా అంటే.. అది అగస్టా కుంభకోణం ఆరోపణల నుంచి సోనియా కుటుంబాన్ని కాపాడడం మాత్రమే. అందుకే అగస్టా వ్యవహారం చోటు చేసుకున్న సమయంలో రక్షణ శాఖ మంత్రిగా ఉన్న ఆంటోనీని హుటాహుటిన కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి పిలిపించింది. ఆంటోనీ ప్రస్తుతం కేరళ ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉన్నారు. ఆయన ఒకప్పట్లో కేరళ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. కేరళలో ఇప్పుడు కాంగ్రెస్ ఏకపక్షంగా అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు గానీ.. కనీసం గౌరవప్రదమైన ఫలితాలనైనా సాధించాలని పార్టీ ఆరాటపడుతున్నది. అలాంటి నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆంటోనీని హఠాత్తుగా ఢిల్లీ పిలిపించేశారు.
రాజ్యసభలో బుధవారం నాడు అగస్టా హెలికాప్టర్ల కుంభకోణం గురించి చర్చ జరగబోతున్నది. సోనియా కుటుంబం ప్రధానంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వారి మీద మచ్చ నిరూపణ కాకుండా కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ వారంతా కలిసి తహతహ లాడిపోతున్నారు. సోనియా నిరపరాధి అని ఇటలీ న్యాయమూర్తి తేల్చినట్లుగా కాంగ్రెస్ ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్నది. కానీ.. రాజ్యసభలో చర్చ నేపథ్యంలో ఎన్నికల కంటె అమ్మరక్షణనే వారు ఎక్కువగా భావిస్తున్నారనేది, ఆంటోనీని పిలిపించడంతో తేలిపోతున్నది.