సోనియా గాంధీ…దివంగత ప్రధాని ఇందిరా గాంధీ కోడలు.. మాజీ దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ భార్య. 1968లో రాజీవ్‌ను వివాహమాడిన దగ్గర్నుంచి, ఇందిర ఇంట్లోనే ఉంటున్న సోనియాకు రాజకీయాలవైపు చూడాల్సిన అవసరం రాలేదు. రాజీవ్ హత్యానంతరం కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను స్వీకరించాల్సి వచ్చింది. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చినప్పటికీ ఆమెకు ప్రధాని పదవి చేపట్టే వీలు కలగలేదు. కారణం పార్టీలోని పాత తరం..ఆమెకు వ్యతిరేకవర్గమూనూ. అలాంటి సోనియా నోటి వెంట మొదటిసారిగా మనస్సాక్షి అనే పదం వెలువడింది. ఈరోజు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్‌కు తెరలేవనున్న సందర్భంలో ఆమె ఈ పిలుపునిచ్చారు. రాష్ట్రపతి అభ్యర్థిని ఎన్నికునేందుకు మనస్సాక్షిని అనుసరించాలనేది ఆమె పిలుపు.
అసలు మనస్సాక్షి గురించి ఆమెకు తెలుసా అనేది ప్రశ్న. రాజకీయాల్లో తమకు వ్యతిరేక పరిస్థితులు ఏర్పడినప్పుడల్లా మనస్సాక్షి గుర్తుకొస్తుంది. పార్టీ అధికార అభ్యర్థి నీలం సంజీవరెడ్డిని మనస్సాక్షి ప్రకారం అన్న పిలుపుతోనే అప్పటి ప్రధాని ఇందిర రాష్ట్రపతి ఎన్నికల్లో ఓడించారు. ఆ ఎన్నికల్లో ఇందిరా అనధికార అభ్యర్థిగా వివి గిరిని నిలబెట్టి, ఈ పిలుపుతో గెలిపించుకున్నారు. మెజారిటీ ఉన్నప్పటికీ అధికారపక్ష అభ్యర్థి ఓటమి పాలుకావడం అదే ప్రథమం. నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా ఉన్నప్పుడు నిబంధనావళిని కఠినంగా పాటించడం ఇందిరకు రుచించలేదు. అందుకే ఈ పద్ధతిని అనుసరించింది ఇందిర. ఇప్పుడు సోనియా ఈ పదాన్ని ఉచ్చరించడానికి ఎటువంటి సందర్భమూ లేదు. అధికార పక్షం సమైక్యంగా ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్షం సైతం ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించాయి. కేవలం 55మంది ఎంపీలు మాత్రమే ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి ఎలాగూ విజయం సాధించే అవకాశం లేదు కాబట్టి ఆమె మనస్సాక్షిని తెరపైకి తెచ్చారు. ఈ పిలుపునిచ్చే అర్హత సోనియా గాంధీకి అస్సలు లేదు. ఎందుకంటే.. యూపీఏ పదేళ్ళ పాలనలో సాగిన అరాచకాలు.. కేసుల నిర్వీర్యం.. ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన వంటి నిర్ణయాలు చాలు ఆమెకు మనస్సాక్షి కాదు కదా.. అసలు అంతరంగమే లేదని చెప్పడానికి. సంకుచిత భావం, విభజన-మతవాదాలపై ప్రతిపక్షంగా తాము పోరాడుతున్నామనీ, మద్దతునివ్వాలనీ సోనియా ఎంపీలకు పిలుపునిచ్చారు. మనం నమ్ముతున్న విలువలపై మనకు విశ్వాసముండాలని కూడా పేర్కొన్నారు.
ఆమె నమ్మిన విలువలు..దోపిడీ..కుంభకోణాలు.. ఏకపక్ష నిర్ణయాలు. సంకుచిత ధోరణి. ఏపీ విభజన ఏకపక్ష నిర్ణయానికే కాగా, సంకుచిత ధోరణికీ కేంద్రంగా నిలిచింది. ఆ నిర్ణయంతో ఏపీలో కాంగ్రెస్ సమూలంగా తుడిచిపెట్టుకుపోయింది. దేశంలో అధికారానికి దూరమైంది. యూపీఏ భాగస్వామ్య పక్షాలు కలిసినా 55 ఎంపీ సీట్లు కూడా దక్కలేదు. అనువుగాని చోట అధికులమనరాదు అన్న సూత్రాన్ని సోనియా పాటించి ఉంటే కాస్త..ప్రజలు ఆమెవైపు చూసేవారేమో. అది మాని రాష్ట్రపతి ఎన్నికల్లో ఆమె కుల ఆధారిత పోరాటానికి తెరలేపారు. రామ్‌నాథ్ కోవింద్‌కు వ్యతిరేకంగా బాబూ జగజ్జీవన్ రామ్ కుమార్తె, మాజీ స్పీకర్ అయిన మీరా కుమార్‌ను రంగంలోకి దింపారు. దేశ ప్రథమ పౌరుడిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి ఆమె అంగీకరించలేదు. ప్రణబ్‌నే అభ్యర్థిగా ప్రతిపాదించి ఉంటే ఆమె అంగీకరించి ఉండేవారేమో. అధికార పక్షం తమ అభ్యర్థి ఉండాలనుకోవడం సహజమే కదా. ఇలాంటి నేపథ్యంలో సోనియా `మనస్సాక్షి` పిలుపు ఫలించబోదనడం అతిశయోక్తి కాదు.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి