23న మేడ్చల్ లో భారీ బహిరంగ సభకు తెలంగాణ కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తరువాత సోనియా గాంధీ రాష్ట్రానికి వస్తున్నారు. దీంతో ఈ సభను అత్యంత భారీగా నిర్వహించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక్క మేడ్చల్ నియోజక వర్గం నుంచి లక్ష మందిని సభను సమీకరించాలన్నది పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇక, మిగతా 118 నియోజక వర్గాల నుంచి కనీసం ఐదు వేలమంది చొప్పున కార్యకర్తల్ని సభకు వచ్చేలా పార్టీ లక్ష్యాలను పెట్టుకుంది. కనీసం ఏడు లేదా ఎనిమిది లక్షల మందిని సోనియా సభకు తరలించాలన్నది టి. కాంగ్రెస్ లక్ష్యంగా తెలుస్తోంది.
ఇప్పటికే సభ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి అధిష్టానం అప్పగించిన సంగతి తెలిసిందే. మంగళవారం నాడు ఆయన సభా ప్రాంగణానికి వెళ్లి, అక్కడి ఏర్పాట్ల తీరును పరిశీలించారు. ఇక, సోనియా సభ జరుగుతున్నంత సేపు రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాల్లోనూ ఎల్.ఇ.డి. స్క్రీన్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు చేయబోతున్నారు. నియోజక వర్గాల్లోని ముఖ్య ప్రదేశాల్లో స్థానిక కార్యకర్తలు, ప్రజలు చూసే విధంగా ఏర్పాట్లు భారీగా చేస్తున్నట్టు సమాచారం.
నిజానికి, ఈ సభను దిగ్విజయం చేసుకోవాల్సిన అవసరం టి. కాంగ్రెస్ శ్రేణులకు ఉంది. ఎందుకంటే, ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే కాంగ్రెస్ కొంత వెనకబడిందనే అభిప్రాయం ఉంది. తెరాస అధినేత కేసీఆర్ ఇప్పటికే ఓ దఫా ప్రచారం ముగించుకుని, రెండో దశలో భాగంగా వరుస సభలు నిర్వహిస్తున్నారు. కానీ, కాంగ్రెస్ లో చివరి నిమిషం వరకూ టిక్కెట్ల కేటాయింపుల తంతే నడుస్తూ వచ్చింది. నియోజక వర్గాల్లో తెరాసకు ధీటుగా కాంగ్రెస్ లేదా కూటమి నుంచి ఎవరు ప్రచారం చేయాలనే మీమాంశ ఉంటూ వచ్చింది. దీంతో ప్రచారంలో కాంగ్రెస్ వెనకబాటు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, సోనియా, రాహుల్ సభలతో కాంగ్రెస్ ప్రచారానికి కిక్ స్టార్ట్ వస్తుందనీ… ఒక్కసారిగా వేవ్ వచ్చేస్తుందని టి. నేతలు ధీమాగా ఉన్నారు.
సోనియా సభ ద్వారా తెలంగాణ సెంటిమెంట్ ను ప్రముఖంగా తెర మీదికి తేవాలన్నదే కాంగ్రెస్ ప్రయత్నం కూడా! తెలంగాణ ప్రజల ఆకాంక్షలను తామే అర్థం చేసుకున్నామనీ, అందుకే రాష్ట్రం ఇచ్చామని సోనియాతో చెప్పించడం ద్వారా తమకు ప్లస్ అవుతుందని అనుకుంటున్నారు. మరి, వారు ఆశిస్తున్న సెంటిమెంట్ ప్రజల నుంచి నిజంగానే రాబట్టుకోగలరా, దాన్ని ఓటుగా మార్చుకోగలరా అనేది వేచి చూడాలి. ఏదేమైనా, సోనియా సభ మీద కాంగ్రెస్ చాలా ఆశలు పెట్టుకుందనేది వాస్తవం.