ఎప్పుడూ స్తంభిస్తుంది కాబట్టే పార్లమెంటను అన్ని స్తంభాలతో కట్టారని ఆ మధ్య ఓ పత్రికలో కార్టూన్ వచ్చింది. అదేంటో, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ప్రతి సెషన్ లో ప్రతి రోజూ స్తంభిస్తోంది. బీజేపీ అంటే కాంగ్రెస్ కు, కమ్యూనిస్టులకు నచ్చకపోవచ్చు. కానీ ప్రజలు ఇచ్చిన మెజారిటీని గౌరవించే సంస్కారమైనా ఉండాలి.
ఈనెల 23న మొదలయ్యే బడ్జెట్ సమావేశాలు కూడా ఇంతే సంగతులని అప్పుడే సంకేతాలు అందాయి. ఢిల్లీ జెఎన్ యు వివాదంపై గొడవ చేయడానికి కొన్ని విపక్షాలు రెడీ అయ్యాయి. జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన విద్యార్థులకు అనుకూలంగా పార్లమెంటు నినాదాలతో హోరెత్తడం ఖాయంగా కనిపిస్తోంది. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ భారత్ కు వ్యతిరేకంగా నీచమైన నినాదాలు చేసిన విద్యార్థులను భారత రత్నాలనే స్థాయిలో కీర్తించడానికి కొన్ని పార్టీల వారు పోటీ పడ్డా అశ్చర్యం లేదు. అఫ్జల్ గురును పొగడటం తప్పంటూనే, విద్యార్థులపై చర్య తీసుకోవడం తప్పనడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో? అంతేకాదు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివాదంపైనా రాహుల్ గాంధీ కేంద్రంపై దుమ్మెత్తి పోయడానికి ఇప్పటికే సంసిద్ధమయ్యారు. అక్కడా అఫ్జల్ గురు అనుకూల ప్రదర్శన తర్వాతే వివాదం మొదలైంది. తప్పు ఎవరిదైనా ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దేశం ఓ ప్రతిభావంతుడైన యువకుడిని కోల్పోయింది. అయితే, ఉగ్రవాదికి అనుకూలంగా ప్రదర్శన ఇవ్వడం తప్పని ఒప్పుకోవడం రాహుల్ గాంధీ వల్ల కాలేదు. ఓట్ల వేటలో ఆయనకు వాస్తవాలు పూర్తిగా కనిపించ లేదు. కొన్ని మాత్రమే కనిపించాయి. ఇప్పుడు జేఎన్ యు గొడవతో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు రాజ్యసభను నిమిషం కూడా నడవనివ్వకుండా స్తంభింప చేస్తే అందులో ఆశ్చర్యం ఏమీ లేదు.
రాజకీయ పార్టీల మధ్య విభేదాలుండొచ్చు. ఒకరి సిద్ధాంతాలు మరొకరికి నచ్చకపోవచ్చు. కానీ దేని గురించైనా చర్చించడానికి పార్లమెంటు అత్యుత్తమమైన వేదిక అనే ఇంగితం లేకుండా గత సెషన్లో కొందరు కాంగ్రెస్ సభ్యులు ప్రవర్తించిన తీరు హేయం. నేషనల్ హెరాల్డ్ కేసుకు వ్యతిరేకంగా అంటే పరువుపోతుందేమో అని, అసలు డిమాండ్ ఏమిటో చెప్పకుండా సభను స్తంభింపచేశారు. రకరకాల జంతువుల్లా అరుస్తుంటే డిప్యుటీ చైర్మన్ కురియన్ ఆశ్చర్యపోయారు. ఇది మనుషులు ప్రవర్తించాల్సి తీరు కాదన్నారు. అసలు మీ డిమాండ్ ఏమిటో చెప్పండని అడిగారు. అకారణంగా సభను స్తంభింపచేయడం ఇతర సభ్యుల హక్కులను కాలరాయడం అన్నారు. అయినా కొందరు కాంగ్రెస్ సభ్యులు అనాగరికంగా ప్రవర్తించారు. ఈసారి కూడా అదే జరగడం ఖాయంగా కనిపిస్తోంది.