ఢిల్లీలో సుదీర్ఘంగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ముగిసింది. రాహుల్ గాంధీని అధ్యక్షుడిగా కొనసాగాలంటూ చివరి వరకూ నాయకులు పట్టుబడుతూ వచ్చారు. రాహుల్ గాంధీ స్థానంలో ఎవరిని అధ్యక్షునిగా నియమించాలనే అంశమై ఐదు కమిటీలు వేశారు, ఆ కమిటీలు ఆయా రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నేతల అభిప్రాయాలు తెలుసుకున్నారు. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకూ ఈ కసరత్తు కొనసాగింది. చిట్ట చివరికి… కాంగ్రెస్ పార్టీ బాధ్యతల్ని మరోసారి సోనియా గాంధీకి అప్పగిస్తూ సీడబ్ల్యూసీ తీర్మానించింది.
రాహుల్ గాంధీని ఒప్పించే ప్రయత్నం చివరి నిమిషం వరకూ కొనసాగిందని సమాచారం. రాష్ట్రాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర అధ్యక్షులు… ఇలా అందరూ రాహుల్ కొనసాగాలంటూ పట్టుబట్టారు. ఈ మధ్య ఓదశలో, రాజీనామాల ప్రహసనం కూడా నడించింది. అయితే, గడచిన పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయిందనీ, తన సారథ్యంలో ఎన్నికలు జరిగాయి కాబట్టి, పార్టీని గెలుపు బాటలో నడిపించలేకపోయినందుకు నైతిక బాధ్యత వహిస్తూ తాను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటానని ఈరోజు మరోసారి రాహుల్ స్పష్టం చేశారు. దీంతో, సోనియాకి మరోసారి బాధ్యతలు అప్పగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తికి బాధ్యతలు అప్పగించాలనీ రాహుల్ గతంలో అభిప్రాయపడ్డ సంగతి తెలిసిందే. కానీ, పార్టీ నాయకులంతా చివరికి సోనియాకే పగ్గాలు కట్టబెట్టారు.
బాధ్యతలు సోనియాకి ఇచ్చారు కాబట్టి, రాహుల్ ఏం చేస్తారనే అంశంపై ఇప్పుడు కొంత ఆసక్తి నెలకొంది. అయితే, ఆయన రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారనీ, పార్టీ కోసం ఒక సైనికుడిగా పోరాటం చేస్తారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. దేశంలో మోడీ సర్కారు నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందనీ, కాశ్మీరు అంశంతో సహా చాలా అంశాల్లో దూకుడుగా వెళ్తోందనీ, వీటన్నింటిపై ఇకపై పార్టీ తరఫున రాహుల్ గాంధీ నిరసన కార్యక్రమాలు చేపడతారని సమావేశం అనంతరం పార్టీ నేతలు మీడియాతో చెప్పారు. సోనియా అధ్యక్షురాలిగా ఉన్నప్పుడే పార్టీ అధికారంలోకి వచ్చింనద, వచ్చే లోక్ సభ ఎన్నికల వరకూ ఆమె పార్టీని నడిపిస్తారని కుంతియా అన్నారు. మొత్తానికి, ఇవాళ్టితో రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా ఉండి తీరాలంటూ కొనసాగుతూ వస్తున్న చర్చకు బ్రేక్ పడుతుందని భావించొచ్చు.