నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇతర నిందితులకు ఢిల్లీలోని పాటియాల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో తొలిసారి విచారణకు హాజరైన సోనియా, రాహుల్, ఇతర నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కోర్టు మన్నించింది. ఒక్కొక్కరికి 50 వేల రూపాయల పూచీకత్తు, ఒక ష్యూరిటీపై బెయిల్ మంజూరైంది. 5 నిమిషాల్లో బెయిల్ ప్రక్రియ పూర్తయింది.
ఈ కేసులో సోనియా, రాహుల్ బెయిలు కోసం దరఖాస్తు చేయకుండా జైలుకు వెళ్తారని, సానుభూతి అస్త్రం ప్రయోగిస్తారంటూ ఊహాగానాలు వచ్చాయి. 1977లో జరిగిన ఇందిరా గాంధీ అరెస్టును ఉదహరిస్తూ అనేక వార్తలు వచ్చాయి. గత వారం రోజులుగా మీడియాలో విపరీతమైన హైప్ వచ్చేసింది. రాజకీయంగా ఇది హాట్ టాపిక్ గా మారింది. ఈ హైప్ మీడియా సృష్టించిందా లేక కాంగ్రెస్ వారు ఇలా చేశారా అనేది స్పష్టం కాలేదు. అయితే, వ్యూహాత్మకంగానే కొందరు కాంగ్రెస్ నాయకులు జైలు కామెంట్స్ తో ఊహాగానాలు వ్యాపింప చేశారనే విమర్శలున్నాయి.
ఏది ఏమైనా నేషనల్ హెరాల్డ్ కేసులో అసలైన పోరాటం మొదలైంది. నిందితుల తొలి హాజరు పూర్తయింది. ఈ కేసు తదుపరి విచారణ వచ్చే ఏడాది ఫిబ్రవరి 20కి వాయిదా పడింది. అప్పటి వరకూ దీనిపై రాజకీయ పోరాటం చేయాలని కాంగ్రెస్ నిర్ణయించినట్టు స్పష్టమవుతోంది. బెయిల్ మంజూరు కాగానే సోనియా, రాహుల్ తో పాటు సీనియర్ కాంగ్రెస్ నేతలు పార్టీ జాతీయ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ప్రధాని మోడీపై దుమ్మెత్తి పోశారు. తమను లొంగదీసుకోవడానికే మోడీ తప్పుడు కేసు వేయించారని రాహుల్ గాంధీ ఆరోపించారు.
కేంద్రం ఎంత వేధించినా తాము భయపడేది లేదని సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ నేతలు మాట్లాడిన తీరును బట్టి, బీజేపీని వీలైనంద బద్నాం చేయడానికి వారు కంకణం కట్టుకున్నట్టు అర్థమవుతోంది.
నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో సోనియా, రాహుల్ అక్రమాలకు పాల్పడ్డారంటూ పిటిషన్ దాఖలు చేసిన సుబ్రమణ్య స్వామి బీజేపీ నాయకుడు కావడంతో ఇది మోడీ ఆడించిన గేమ్ అని కాంగ్రెస్ విమర్శిస్తోంది. దీనిని కమలనాథులు ఎలా కౌంటర్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ అంశంపై కేసు వేసే సమయానికి సుబ్రమణ్య స్వామి బీజేపీ లో లేరు. పైగా యూపీఏ హయాంలో అనేక స్కాములపై ఆయన పిటిషన్లు దాఖలు చేశారు. ఫలితంగా అనేక కేసుల్లో కొత్త వాస్తవాలను బయటకు తేవడానికి ప్రయత్నించారు. ఇది రాజకీయ కక్షసాధింపులో భాగమని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణను బీజేపీ తిప్పికొడుతోంది. అక్రమాలు చేసిన వారే ఎదురు దాడి చేస్తున్నారని బీజేపీ నేతలు కౌంటర్ అటాక్ చేస్తున్నారు.
ఈనెల 23న పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగుస్తాయి. ఈ మూడు రోజులూ కాంగ్రెస్ వారి హంగామాతో ఉభయ సభలూ దద్దరిల్లుతాయో లేదో చూడాలి. సమావేశాల తర్వాత కూడా బీజేపీని ఇరుకున పెట్టడానికి కాంగ్రెస్ చేసే ప్రయత్నానికి చెక్ పెట్టడం బీజేపీకి ఓ సవాలే కావచ్చు.