సోనియా రాజకీయ కార్యదర్శిగా సుదీర్ఘ కాలంగా వ్యవహరిస్తున్న అహ్మద్ పటేల్ ఆర్థికపరమైన అవకతవకల చిక్కుల్లో పడ్డారు. గతంలో.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఇన్ ఫ్రా కంపెనీ సోదాల్లో… కాంగ్రెస్‌కు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చినట్లుగా తేలినట్లుగా ప్రచారం జరిగింది. ఆ విరాళాల విషయంలో అహ్మద్ పటేల్‌కు ఈడీ సమన్లు ఇచ్చింది. కానీ గతంలో ఆయన హాజరు కాలేదు. ఆ కేసు నడుస్తూండగానే.. తాజాగా.. మరో ఆర్థికపరమైన అవకతవక కేసులో ఆయనను ఈడీ టార్గెట్ చేసింది. కుంటి సాకులు చెప్పి ఆయన విచారణకు ఎగ్గొడుతూండటంతో.. నేరుగా ఆయన ఇంటికే వెళ్లి విచారణ జరిపింది.
సందేశార అనే వ్యక్తులకు చెందిన కంపెనీల స్కాంలో విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ.. అహ్మద్ పటేల్‌కు గతంలో రెండు సార్లు సమన్లు జారీ చేసింది. అయితే వయోవృద్ధులు తమ ఇళ్లకే పరిమితం కావాలన్న కొవిడ్-19 వ్యాప్తి మార్గదర్శకాల అనుసారం.. తాను హాజరు కాలేనంటూ అహ్మద్ పటేల్ తన అనాసక్తిని వెలిబుచ్చారు. దీంతో ఈడీ, దర్యాప్తు బృందాన్ని సెంట్రల్ ఢిల్లీలని మదర్ థెరిసా క్రిసెంట్ వద్దనున్న ఆయన ఇంటికే పంపారు. గుజరాత్‌కు చెందిన స్టెర్లింగ్ బయోటెక్ సంస్థకు చేతన్ సందేశారా, నితిన్ సందేశారా అనే వ్యక్తులు యజమానులు. వారు ఆంధ్రా బ్యాంకు నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం నుంచి రూ.5,383 కోట్ల రుణాలను పొందింది. రుణాలను దారి మళ్లించి వారు ఆఫ్రికా పారిపోయారు.
సందేశరా సోదరుల నుంచి అహ్మద్ పటేల్‌కు డబ్బులు ముట్టినట్లు ఆధారాలు ఉన్నాయి. దీనిపై ఈడీ విచారణ చేపట్టాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. దీనిపై ఈడీతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా ఆయన్ను విచారించారు. కాంగ్రెస్ ఇప్పటికే చిక్కుల్లో ఉంది. ఆ పార్టీకి చెందిన అనేక మంది నాయకులు.. ఆర్థికపరమైన అవకతవకల కేసుల్లో చిక్కుకున్నారు. ఇప్పుడు అహ్మద్ పటేల్ వంతు.