కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై చర్చ శుక్రవారం జరగనుండటంతో… అధికార, ప్రతిపక్షాల మధ్య మైండ్ గేమ్ ప్రారంభమయింది. ప్రస్తుతం పార్లమెంట్ లో 535 మంది సభ్యులున్నారు. వీరిలో 273 మంది బీజేపీ సొంతసభ్యులే. ఈ కారణంగా బీజేపీకి సాధారణ మెజార్టీకి కావాల్సిన సంఖ్య కన్నా ఎక్కువే ఉన్నారు. వీరికి మిత్రపక్షాలు అదనం. కానీ అవిశ్వాసం పై చర్చ జరిగి ఓటింగ్ అంటూ జరిగితే.. ఏం జరుగుతుందోన్న టెన్షన్ బీజేపీకి సహజంగానే ఉంటుంది. అందుకే… వెంటనే … విప్ జారీ చేసింది. సభ్యులంతా..తప్పనిసరిగా సభకు హాజరవ్వాలని ఆదేశించింది.
మరో వైపు కాంగ్రెస్ పార్టీ మైండ్ గేమ్ ప్రారంభించింది. బీజేపీ తర్వాత రెండో అతి పెద్ద పార్టీగా ఉన్నా… కాంగ్రెస్ కు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు బీజేపీ. దానికి నిబంధనలు సాకుగా చూపింది. ఆ కసి అంతా.. సోనియా గాంధీ ఇప్పుడు చూపిస్తున్నారు. బలం లేకుండా..అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టారన్న మీడియా ప్రశ్నలకు ఒకే ఒక్క పదంతో సమాధానం ఇచ్చారు. బీజేపీలోనూ గుబులు పుట్టించారు. “మాకు బలం లేదని ఎవరు చెప్పారు..? ఏం జరుగుతుందో చూస్తూ ఉండండి..” అన్న సోనియా ఆన్సర్ ఒక్కసారిగా హెడ్ లైన్స్ కి ఎక్కింది. సోనియా అలా మాట్లాడారంటే.. తెర వెనుక ఏమైనా కసరత్తులు జరుగుతున్నాయా అన్న అనుమానం సహజంగానే అందరిలోనూ ఏర్పడుతుంది. బీజేపీలోనూ అదే ఏర్పడింది.
నిజానికి అవిశ్వాస వ్యూహం చంద్రబాబుది. తాము ఏమి చేస్తున్నది ఎక్కడా బయటకు పొక్కకుండా చంద్రబాబు వ్యవహారాలు చక్కబెడుతున్నారు. చంద్రబాబు సామర్థ్యం మీద బీజేపీ అగ్ర నేతలకు ఎవరికీ అనుమానాల్లేవు. అందుకే వారు టెన్షన్ పడుతున్నారు. ఇటీవలి కాలంలో బీజేపీలోని రిజర్వుడు నియోజకవర్గాల ఎంపీలు… సొంత పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నప్రచారం జరుగుతోంది. యూపీలో ఎస్పీ-బీఎస్పీ పొత్తుతో… అక్కడి ఎంపీలుపైనా బీజేపీ అగ్రనేతలు నమ్మకం పెట్టుకోలేకపోతున్నారు.అందుకే ఎటొచ్చి ఏం జరుగుతుందోనన్న ఆందోళనలో పడిపోయారు.
సోనియాగాంధీ నెంబర్లు మాకున్నాయని కాన్ఫిడెంట్ చెబుతున్నదాన్ని బీజేపీ పైకి లైట్ తీసుకుంటోంది. కానీ అంతర్గతంగా మాత్రం ఇప్పటికే విరుగుడు వ్యూహం ప్రారంభించింది. ప్రభుత్వాన్ని పడగొట్టలేకపోయినా.. ఓటింగ్ లో సొంత పార్టీ ఎంపీలు పరువు తీస్తే… ఎన్నికల ముందు … పలుచనైపోతామని భయపడుతున్నారు. మొత్తానికి అవిశ్వాసం విషయంలో బీజేపీ ధైర్యంగా ముందడుగు వేసినా..మైండ్ గేమ్ లో మాత్రం కాంగ్రెస్ దూకుడు చూపిస్తోంది. అవిశ్వాస అటూ ఇటూ అయినా ప్రతిపక్షాలకు పోయేదేం లేదు కానీ.. కొద్దిగా అటు అయినా.. బీజేపీకి మాత్రం ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది.