చాన్నాళ్ల తరువాత తన బిడ్డల దగ్గరకు ఒక తల్లి వస్తే ఎలా సంతోష పడుతుందో… తెలంగాణకు వచ్చాక తనకు అదే అనూభూతి కలిగిందంటూ ప్రసంగం మొదలుపెట్టారు సోనియా గాంధీ. మేడ్చల్ సభలో ఆమె మాట్లాడుతూ… ప్రత్యేక రాష్ట్రం ప్రకటించే ముందు, ఇది అంత సులువైన అంశం కాదని మొదట్లో అనిపించిందన్నారు. ఆరోజుల్లో ఆంధ్రా, తెలంగాణ ప్రజల బాగోగులు తన కళ్లముందున్నాయి అన్నారు. కానీ, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఉద్యమాలు దృష్టిలో పెట్టుకుని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీతో కలిసి అనుకూల నిర్ణయం తీసుకున్నామన్నారు. రాజకీయంగా కాంగ్రెస్ కి నష్టం జరిగినా ఈ నిర్ణయానికి నాడు వెనకాడలేదన్నారు. ఇదే సమయంలో ఆంధ్రుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ బిల్లుతోపాటు, ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పామన్నారు. ఆంధ్రా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామనీ, ప్రత్యేక హోదా ఇస్తామని ఇప్పుడు మరోసారి చెబుతున్నా అన్నారు.
ఇక్కడి ప్రజలు జీవితాలు బాగుపడతాయని తెలంగాణ ఇచ్చామనీ, కానీ ఇక్కడి పరిస్థితులు చూస్తుంటే ఒక తల్లిగా తనకు ఆవేదన కలుగుతోందన్నారు సోనియా. ఈ నాలుగేళ్లలో ఆశించిన అభివృద్ధి జరగలేదన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఏమేరకు నెరవేరాయి, నీరూ నిధులూ నియామకాలు అంటూ ఉద్యమించారు, కానీ అవి దక్కాయా అంటూ ప్రజలను ప్రశ్నించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి ఉందన్నారు. పేదల కోసం ఉపాధి కల్పన తెచ్చామనీ, కానీ అది అమలు కాలేదన్నారు. నిరుద్యోగులకు ఎదురుచూపులే మిగిలాయన్నారు. ఒకప్పుడు ఇక్కడి మహిళా సంఘాల మహిళలను చూసి తాను సంతోషపడ్డాననీ, ఇతర రాష్ట్రాలకు వెళ్లి చెప్పేవారమన్నారు. కానీ, ఆ సంఘాలను తెరాస అగణదొక్కిందన్నారు. దళితులు, ఆదివాసీలు, అణగారిన వర్గాలకు తెరాస చేసిందేంటని ప్రశ్నించారు?
చిన్న పిల్లల పెంపకంలో లోపం ఉంటే ఎలా ఉంటుందో, నాలుగున్నరేళ్ల తెరాస పాలనలో తెలంగాణ పరిస్థితి అలా మారిపోయిందన్నారు సోనియా. ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకమైనవనీ, ఇది తెలంగాణ ప్రజల భవిష్యత్తుతో ముడిపడినవన్నారు. ఉద్యమ స్ఫూర్తితో ప్రజలు మరోసారి ఆలోచించాలనీ, వారి ఆకాంక్షలు నెరవేరాలంటే కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమికి ఓట్లు వేసి గెలిపించాలన్నారు.
జై తెలంగాణ అంటూ ఆమె ప్రసంగాన్ని ముగించారు. తల్లి సెంటిమెంట్ తో సోనియా మాట్లాడారు అని చెప్పొచ్చు. తన బిడ్డగా తెలంగాణను భావిస్తున్నా, చూస్తున్నా అని చెబుతూనే… కేసీఆర్ పాలనలో ప్రజలు పడుతున్న అవస్థల్ని కూడా ఒక తల్లిగా చూస్తూ తల్లడిల్లా అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.