తెలంగాణ కాంగ్రెస్ సీట్ల కేటాయింపులు, మహా కూటమి పక్షాలకు సీట్ల సర్దుబాట్లు… ఇవన్నీ ఒక కొలీక్కి వచ్చేస్తున్నాయి. కాబట్టి, ఇకపై రాష్ట్రంలో ప్రచారంపై పూర్తి శ్రద్ధ పెట్టేందుకు కాంగ్రెస్ సిద్ధమౌతోంది. అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇప్పటికే రాష్ట్రానికి రెండుసార్లు వచ్చి వెళ్లారు. మరో ఆరు నుంచి ఎనిమిది సభలకు ఆయన హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇక, సోనియా గాంధీ ప్రచారానికి వస్తే బాగుంటుందనే అభిప్రాయం రాష్ట్ర నేతలకు ఎప్పట్నుంచో ఉన్న సంగతి తెలిసిందే. దానికి అనుగుణంగానే ఆమె తెలంగాణ పర్యటనకు సిద్ధమౌతున్నారు.ఈ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ పై చర్చలు మొదలయ్యాయనీ, అభ్యర్థుల జాబితా ప్రకటించిన వెంటనే ఆమె పర్యటనపై కూడా స్పష్టమైన ప్రకటన వెలువడుతుందని రాష్ట్ర నేతలు అంటున్నారు.
కొంతమంది కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్న ప్రకారం… ఈ నెల 19 తరువాత సోనియా తెలంగాణలో పర్యటిస్తారు. 22, 23 తేదీల్లో… అంటే, రెండు రోజులపాటు ఆమె రాష్ట్రంలోనే ఉండే అవకాశం ఉందంటున్నారు. రెండ్రోజులపాటు ఆమె ఇక్కడే ఉంటే… ఉత్తర తెలంగాణలో రెండు సభలు, దక్షిణ తెలంగాణలో రెండు సభల్లో ఆమె పాల్గొనే విధంగా ప్లాన్ ఉంటుందని చెబుతున్నారు. ఏ పరిస్థితుల్లో తెలంగాణలో ఇచ్చామో, ప్రజల ఆకాంక్షల్ని ఎలా అర్థం చేసుకున్నామో అనే కోణంలో ఆమె సభలూ ప్రసంగాలు ఉంటాయని చెబుతున్నారు. తెలంగాణ ఇచ్చిన క్రమాన్ని సోనియా వివరిస్తే… పార్టీకి మరింత ఉపయోగకరంగా ఉంటుందని రాష్ట్ర నేతలు అంటున్నారు.
అయితే, సోనియా రెండ్రోజుల పర్యటన వెనక మరో వ్యూహం కూడా ఉందని చెప్పుకోవచ్చు. బహిరంగ సభలతోపాటు, రాష్ట్ర స్థాయి నేతలందరితో ఆమె భేటీ అవుతారనీ రాష్ట్ర నేత ఒకరు ఆఫ్ ద రికార్డ్ అంటున్నారు. టిక్కెట్ల జాబితా వెలువడ్డ తరువాత ఎంత వద్దనుకున్నా అసంతృప్తులు ఉంటాయి కదా. ఢిల్లీ స్థాయిలో బుజ్జగింపులు జరిగినా, క్షేత్రస్థాయిలో కలిసికట్టుగా నాయకులు ఐకమత్యంగా ప్రచారం చేయాల్సి ఉంటుంది. ఎన్నికల ప్రక్రియలో క్రియాశీలం కావాల్సి ఉంటుంది. కాబట్టి, టిక్కెట్లు దక్కినవారు, దక్కనివారు అని తేడా లేకుండా.. అందరికీ సోనియా గాంధీ దిశానిర్దేశం చేయడం ద్వారా పార్టీలో అంతర్గత సమస్యలు రాకుండా ఉంటాయనేది ఒక వ్యూహంగా తెలుస్తోంది. మొత్తానికి, సోనియా పర్యటన అన్ని రకాలుగా పార్టీ ఉపయోగపడుతుందని నేతలు భావిస్తున్నారు.