వైసీపీ అధినేత జగన్ ను ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సంప్రదించారా..? ఇండియా కూటమికి మద్దతు ఇవ్వాలని జగన్ ను ఆమె అభ్యర్థించారా..?అనే అంశంపై ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
సెంట్రల్ లో ఈసారి ఏ పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ రాకపోవడంతో ఇండియా కూటమి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగా ఎన్డీయే కూటమిలో కింగ్ మేకర్ లుగా మారిన టీడీపీ, జేడీయూలను కాంగ్రెస్ అగ్రనేతలు సంప్రదించారని ఈ క్రమంలోనే ఏపీలో నాలుగు సీట్లను గెలుచుకున్న వైసీపీని కూడా కాంగ్రెస్ సంప్రదించినట్లుగా ప్రచారం జరుగుతోంది.
సోనియా గాంధీ స్వయంగా జగన్ కు ఫోన్ చేశారని, ఇండియా కూటమికి మద్దతు ఇవ్వాలని కోరారనే టాక్ నడుస్తోంది. అందుకు జగన్ సున్నిహితంగా తిరస్కరించారని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రంలోని ఎన్డీయే కూటమికి జగన్ వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఎలాంటి చిక్కులు ఎదుర్కొంటారో ఆయనకు తెలియనిది కాదు. అందుకే భవిష్యత్ రాజకీయాల దృష్ట్యా ఈ ప్రతిపాదనను జగన్ తిరస్కరించారని అంటున్నారు.
అయితే, కేవలం నాలుగు సీట్లను మాత్రమే గెలుచుకున్న జగన్ ను సోనియా గాంధీ సంప్రదించే అవకాశం ఉందా..? అదే సమయంలో జగన్ ను పార్టీ పెద్దలు సంప్రదిస్తే షర్మిల ఊరుకునేవారా..? అంటే రాజకీయాల్లో ఇలాంటి వాటిని కొట్టిపారేయలేం కానీ, షర్మిలను సంప్రదించకుండా జగన్ ను కాంగ్రెస్ నేతలు సంప్రదించే అవకాశం ఎంతమాత్రం లేదు.
జగన్ ను సోనియా గాంధీ సంప్రదించారని జరుగుతోన్న ప్రచారమే నిజమైతే షర్మిల నుంచి ఏదో ఒక రియాక్షన్ వచ్చి ఉండేదని…ప్రస్తుతం ఆలాంటిదేమీ లేకపోవడంతో ఈ ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ ప్రచారాన్ని వైసీపీ నేతలే కావాలని ఉద్దేశ పూర్వకంగా ప్రచారం చేస్తున్నారనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
కేంద్రంలో కింగ్ మేకర్ గా టీడీపీ మారడంతో జగన్ తో కాంగ్రెస్ సంప్రదింపుల అంశాన్ని తెరమీదకు తీసుకొస్తే…బీజేపీ పెద్దలు జగన్ కు కూడా ప్రాధాన్యత ఇస్తారనే వ్యూహంలో భాగంగా ఈ ప్రచారం మొదలు పెట్టారన్న టాక్ వినిపిస్తోంది.