కాపు సామాజిక వర్గం అనేది ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద ఓటు బ్యాంకు గా ఉండడం అన్ని రాజకీయ పార్టీలను ఊరించే అంశమే! అయితే ఈ ఓటు బ్యాంకును తమదిగా చేసుకోవడానికి ఇప్పటికే అధికారంలో ఉన్న తెలుగుదేశం, విపక్షం వైకాపా తమదైన ప్రయత్నాలుచేస్తున్నాయి. చంద్రబాబుకు మాత్రం కాపుల మైలేజీ దక్కకుండా చేయడానికి ముద్రగడ వంటి నాయకులు ఇతోధికంగా శ్రమిస్తున్నారు. ఇదంతా నేపథ్యం కాగా… ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు అంతరించిపోయిన కాంగ్రెస్ పార్టీని లేపి నిల్చోబెట్టడానికి కాపు ఫ్యాక్టర్‌ను, ప్రస్తుతం హాట్ హాట్‌గా ఉన్న ఈ అంశాన్ని తాము ఎంత మేరకు వాడుకోవచ్చు అనే విషయంపై సోనియా తాజాగా దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది.
ఏపీ కాంగ్రెస్ నాయకులు ఈ విషయంలో తమ వంతుకృషి చేస్తూనే ఉన్నారు. కాపులు దీక్షలుచేసినప్పుడెల్లా.. తమ మద్దతు ప్రకటిస్తూనే ఉన్నారు. అంతకు మించి వారుచేయగలిగింది కూడా ఏమీ లేదు. అయితే సోనియా గాంధీస్వయంగా ఆంధ్రప్రదేశ్‌లో కాపు ఉద్యమం గురించి, వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయడం.. అది కూడా.. ఏపీ నాయకుల ద్వారా కాకుండా ఇతర పనుల మీద తనను కలవడానికి వచ్చిన తెలంగాణ నేతల ద్వారా కాపు ఉద్యమం గురించి తెలుసుకోవాలనుకోవడం.. ఆసక్తికరమైన అంశమే!
కాంగ్రెస్ పార్టీకి ఏపీలో తిరిగి జవసత్వాలు తీసుకురాగలరనే విషయంలో లోకల్ పీసీసీ నాయకుల మీద మేడం కు ఉన్న భ్రమలు బహుశా ఈ సరికి తొలగిపోయి ఉండవచ్చు. అందుకే కాబోలు.. తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు వీ హనుమంత రావు ఢిల్లీలో తనను కలవడానికి వచ్చినప్పుడు సోనియా గాంధీ ముద్రగడ ఉద్యమం గురించి ఆరాలు తీసినట్లుగా తెలుస్తోంది. నిజానికి వీహెచ్ తమ తెలంగాణ కాంగ్రెస్ గోడును మేడంతో పంచుకోవడానికి ఢిల్లీ వెళ్లారు. అక్కడి పీసీసీ నాయకత్వం గురించి ఆయన చెప్పుకోదలచిన పితూరీలు ఆయనకు బోలెడున్నాయి. అయితే మేడం అవి చెవిన వేసుకునే పరిస్థితిలో లేదుట! ఏపీలో కాంగ్రెస్ గురించి ఆమెశ్రద్ధ చూపుతున్నట్లుంది. అందుకే ముద్రగడ దీక్ష పరామర్శకు స్వయంగా వెళ్లి.. అక్కడ తనను అనుమతించలేదని దీక్ష కూడా చేసి కొంత సంచలనం సృష్టించిన వీహెచ్ అయితే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందనుకున్నదేమో… ఆయన ద్వారా సోనియా ఆరాలు తీయడానికి ప్రయత్నించినట్లు సమాచారం.
అయినా కాపు ఫ్యాక్టర్ ను క్యాష్ చేసుకుని ఏపీలో ఎదగడానికి పాలక ప్రతిపక్షాలు మాత్రమే కాదు.. అటు ఆటలో అరటిపండు వంటి భాజపా కూడా నానాపాట్లుపడుతోంది. ఇందరి మధ్యలో… అధికారం నుంచి అన్ సీడెడ్ ఆటగాడి స్థాయి పడిపోయిన కాంగ్రెస్ కూడా రేసులోకి వచ్చినంత మాత్రాన వారికి ఏమైనా ఉపయోగం ఉంటుందా? అని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.