నేషనల్ హెరాల్డ్ పత్రికకి చెందిన నిధుల మళ్లింపు విషయంలో డిల్లీ, పాటియాలా కోర్టులో విచారణను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈరోజు సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసారు. ఆ కేసులో పాటియాలా కోర్టులో విచారణకు వ్యక్తిగత హాజరు నుండి తమకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ వారిరువురూ వేసిన పిటిషన్ని డిల్లీ హైకోర్టు త్రోసిపుచ్చింది. దానిని వారిరువురూ ఈరోజు సుప్రీం కోర్టులో సవాలు చేసారు. తమకు జారీ చేసిన సమన్లను రద్దు చేయవలసిందిగా వారు సుప్రీం కోర్టుని అభ్యర్ధించారు.
గత ఏడాది డిశంబర్ 19వ తేదీన పాటియాలా కోర్టులో విచారణకు హాజరయినపుడు వారికి కోర్టు బెయిలు మంజూరు చేసింది. ఆ కేసు విచారణను మళ్ళీ ఫిబ్రవరి 20వ తేదీకి వాయిదా వేసింది. మళ్ళీ కోర్టుకి హాజరయ్యే సమయం దగ్గర పడుతుండటంతో వారిరువురూ సుప్రీం కోర్టు ఆశ్రయించారు.
వారికి పాటియాలా కోర్టు సమన్లు జారీ చేయడాన్ని, మోడీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యగా అభివర్ణిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎంపిలు శీతాకాల పార్లమెంటును స్తంభింపజేశారు. అదే సమయంలో హైకోర్టు వారి అభ్యర్ధనను తిరస్కరించిన తరువాత సుప్రీం కోర్టుని ఆశ్రయిద్దామనుకొన్నారు. కానీ ఆవిధంగా చేయడం కంటే హైకోర్టుకి హాజరయితేనే తమకు ఎక్కువ ప్రచారం, ప్రజల నుండి సానుభూతి లభిస్తుందనే ఉద్దేశ్యంతోనో లేక మరో కారణం చేతనో వారు విచారణకు హాజరయ్యారు.
ప్రజల దృష్టిని ఆకర్షించడానికి దేశంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు, ఎంపిలు, పిసిసి అధ్యక్షులు, సీనియర్ నేతలు, కార్యకర్తలతో కలిసి బారీ ఊరేగింపుగా పాదయాత్ర చేస్తూ వారిరువురూ పాటియాలా కోర్టుకి వెళ్లాలని ఆలోచించారు. కానీ ఆవిధంగా చేస్తే అది న్యాయమూర్తిపై ఒత్తిడి చేసినట్లవుతుందని, ఆయన ఆగ్రహిస్తే కొత్త సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని కాంగ్రెస్ న్యాయవాదులు వారించడంతో ఆ ఆలోచనను విరమించుకొన్నారు.
ఆ సమయంలో దేశ ప్రజలందరి దృష్టి తమపైనే ఉండటంతో రాహుల్ గాంధి బెయిలుకి దరఖాస్తు చేసుకోకుండా జైలుకి వెళ్ళాలని ఆలోచించారు. కానీ ఆఖరు నిమిషంలో ఆ ఆలోచన విరమించుకొని తల్లితో బాటు బెయిలు తీసుకొని బయటపడ్డారు.
ఈసారి కూడా ఆ డ్రామాలన్నిటినీ కొనసాగించే అవకాశం ఉన్నప్పటికీ, పార్టీ నేతలు, పార్టీలో కపిల్ సిబాల్ వంటి ప్రసిద్ద న్యాయవాదుల సలహా మేరకు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. పార్లమెంటు సమావేశాలకి ముందే మళ్ళీ ఈ కధ అంతా నడుస్తునందున ఈసారి కూడా కాంగ్రెస్ ఎంపిలు పార్లమెంటుని స్తంభింపజేస్తారేమో?