హైదరాబాద్: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధి విదేశాంగశాఖమంత్రి సుష్మా స్వరాజ్‌పై ఇవాళ తీవ్రస్థాయిలో చెలరేగిపోయారు. ఆమె పెద్ద డ్రామా ఆర్టిస్ట్ అన్నారు. క్యాన్సర్ వ్యాధి సోకిన లలిత్ మోడి భార్యకు సాయం చేయటం విషయంలో తాను మానవతా దృక్పథంతో వ్యవహరించానంటూ, తనలాంటి పరిస్థితి ఎదురైతే సోనియా ఏమి చేసేవారని సుష్మా నిన్న అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, చట్టాన్ని అతిక్రమించకుండా ఏ సాయమైనా చేసేదానినని కాంగ్రెస్ అధినేత్రి చెప్పారు. తను చేసిన తప్పును కప్పిపుచ్చుకోవటానికి సుష్మా నాటకాలాడుతున్నారని అన్నారు. మరోవైపు రాహుల్కూడా సుష్మాపై చెలరేగిపోయారు. దొంగతనం చేసేవాళ్ళు అంతా రహస్యంగా చేస్తారని, సుష్మా చేసిన సాయంగురించి ఆమెకు తప్ప విదేశాంగమంత్రిత్వశాఖలో ఒక్కరికికూడా తెలియదని, అలాగే దొంగతనంలో ఆర్థిక లావాదేవీలు బయటకు కనబడవని, ఇక్కడకూడా సుష్మా భర్త, కుమార్తెకు లలిత్ మోడి ఇచ్చిన డబ్బు బయటకు కనబడకుండా చేశారని రాహుల్ ఆరోపించారు. లలిత్ మోడినుంచి తన కుటుంబానికి అందినదెంతో సుష్మా బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
సుష్మా స్వరాజ్ ప్రమేయమున్న లలిత్ గేట్ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. గతనెల 21న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైననాటినుంచీ సుష్మా స్వరాజ్ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ పట్టుపట్టుకు కూర్చుంది. సోమవారంనాడు 25మంది ఎంపీలను లోక్ సభ స్పీకర్ సస్పెండ్ చేయటంతో నాలుగు రోజులుగా పార్లమెంట్ ఆవరణలో స్వయంగా సోనియా, రాహుల్ నేతృత్వంలో ఆపార్టీ ఎంపీలంతా ఆందోళన చేస్తున్నారు. సోనియా ఈ విషయంపై ఇంత పట్టుపట్టటానికి మూలాలు ఇప్పటివి కావని, 16 సంవత్సరాలనాటివని ఒక వాదన ఇప్పుడు తెరపైకి వచ్చింది.
1998లో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన సోనియాగాంధి 1999 ఎన్నికలలో ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించాలనుకున్నపుడు కర్ణాటకలోని బళ్ళారిని, ఉత్తరప్రదేశ్‌లోని అమేథిని ఎంపిక చేసుకున్నారు. ఈ రెండూ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు. బీజేపీ బళ్ళారిలో సోనియాపైన తమ అభ్యర్థిగా సుష్మా స్వరాజ్‌ను రంగంలోకి దించింది. సుష్మా ఆ ఎన్నికలో బాగా కష్టపడ్డారు. కేవలం 12 రోజుల వ్యవదే ఉన్నప్పటికీ తక్కువ సమయంలోనే కన్నడ భాషను నేర్చుకుని నియోజకవర్గమంతా బాగా తిరిగి ప్రచారం చేశారు(తర్వాతికాలంలో సోదరుడుగా మారిన గాలి జనార్దనరెడ్డి అప్పుడే ఆమెకు పరిచయం అయ్యారు). సోనియాకు బ్రహ్మాండమైన పోటీ ఇచ్చి చుక్కలు చూపించారు. కేవలం 56 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. తర్వాత ప్రధాని అయిన వాజ్‌పేయి – ఓడిపోయినప్పటికీ సుష్మా పనితీరు నచ్చి ఆమెను కేంద్రంలో క్యాబినెట్ మంత్రిని చేశారు. అలా సోనియాపై పోటీవలన సుష్మా స్థాయి పెరిగింది. ఇది సోనియాకు, సుష్మాకు మధ్య మొదటి విరోధంకాగా రెండవది 2004లో చోటుచేసుకుంది. 2004 పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణకూటమి విజయం సాధించి ప్రధానిని ఎంపిక చేసే సమయంలో సోనియా గాంధిపేరు ప్రస్తావనకొచ్చింది. అప్పడు సుష్మా రెచ్చిపోయారు. ఒక విదేశీ వనిత ప్రధానమంత్రి కావటానికి వీల్లేదంటూ మండిపడ్డారు. సోనియాగాంధిని ప్రధానిని చేస్తే తాను గుండుగీయించుకుంటానని, భారతీయ విధవరాలిలాగా జీవితమంతా గుడిసెలో కాపురమంటానని మంగమ్మ శపథం చేశారు. దీనికి అనుకూలంగా, వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పెద్ద చర్చలు జరిగాయి. ఏది ఏమైనా చివరకు సోనియా తనకు తానుగా ప్రధాని అభ్యర్థిత్వంనుంచి ఉపసంహరించుకోవటంతో ఆ వివాదం అక్కడితో ముగిసింది. అయితే సోనియా ఈ విషయాలన్నింటినీ బాగా గుర్తు పెట్టుకున్నారని, అందుకే ఇప్పుడు లలిత్ గేట్ వ్యవహారాన్ని వదలకుండా పట్టుకున్నారన్నది ఇప్పుడు తెరపైకి వచ్చిన వాదన. సోనియా ఇంత దూకుడుగా, ధాటిగా, ప్రత్యక్షంగా ఆందోళనకు దిగడం గతంలో లేదన్నది వాస్తవం. అయితే బీజేపీలో బయటపడిన కుంభకోణాలు, వివాదాలు ప్రతిపక్షాలకు మంచి ఆయుధాలనిచ్చాయన్నదికూడా నిజం. దీనిపై నరేంద్రమోడి మౌనం వహించటం అగ్నికి ఆజ్యం పోసినట్లుగా ఉంది. బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీయడానికి వచ్చిన ఈ అవకాశాలలో తన పాతకక్షలు తీర్చుకునే అవకాశం కూడా ఉండటంతో సోనియాకు మరింత ఉత్సాహం వచ్చిఉండొచ్చు.