దేవుడిని విమర్శించినా, దేవుడి పేరుతో జరిగే కార్యక్రమాలను విమర్శించినా టప్ మని కళ్ళు పేలిపోతాయి అన్న మూఢ భ్రమలను క్రియేట్ చేయడంలో మన సొసైటీ ఎప్పుడో సక్సెస్ అయింది. అందుకే దేవుడికి సంబంధించిన విషయాలపై ఎవరైనా సద్విమర్శలు చేసినా కూడా వెంటనే జనాలందరూ కూడా విరుచుకుపడిపోతారు. విచక్షణా రహితంగా క్రూర మృగాల్లా దాడి చేస్తారు. మరి ఉన్మాదుల్లా రెచ్చిపొమ్మని ఏ పవిత్ర గ్రంథం చెప్పిందో…ఏ మతం చెప్పిందో…ఏ దేవుడు చెప్పాడో తెలియదు. అన్ని మతాలు చెప్పిన విషయాల సారాంశం అంతా శాంతంగా ఉండమని, సకల జీవరాశిని, ప్రకృతిని ప్రేమించమన్నట్టుగానే ఉంటుంది. ఒక్కొక్కరూ ఒక్కోలా చెప్పినప్పటికీ స్థూలంగా ఇదే మెస్సేజ్ ఉంటుంది. మరి ఈ భక్తులలో ఎవ్వరూ కూడా నిజమైన భక్తులు కాదో…లేక ప్రపంచాన్ని రక్షిస్తున్న దేవుడికి ఏదో అయిపోతోంది….ఆ దేవుడిని మనమే కాపాడాలి అన్న తాపత్రయంతో ఉన్మాదంగా రియాక్ట్ అవుతున్నారో తెలియదు కానీ మత గ్రంథాల్లో చెప్పిన ప్రవర్తనకు…పూర్తి వ్యతిరేంగా ఈ భక్తజనులు రెచ్చిపోతున్నారు.
అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు బాలీవుడ్ సింగర్ సోనూనిగమ్ టార్గెట్ అయ్యాడు. ప్రార్థనా మందిరాల్లో లౌడ్ స్పీకర్లు ఎందుకు? అని ప్రశ్నించిన పాపానికి సోనూనిగమ్ చాలా పెద్ద పాపిష్టివాడు అయ్యాడు. ఇప్పుడు ఆ పాపిని శిక్షించి దేవుడి మెప్పును పొందడం కోసం అన్ని మతాలకూ చెందిన బోలెడు మంది వీర భక్తులు రెడీ అయిపోయారు. ఆ వీర భక్తుల్లో చదువుకున్న జనాలే అధికం అన్నది గమనించాల్సిన విషయం. ఆవేశంగా ప్రతిస్పందించే ముందు ఒక్క క్షణం విచక్షణతో ఆలోచిస్తే…భక్తి అనేది మనసుకు సంబంధించిన విషయం. ఇంచుమించుగా మతగ్రంథాలన్నీ కూడా మనసులో భగవంతుడిని ధ్యానించమనే చెప్పాయి. లౌడ్ స్పీకర్స్ పెట్టి ఊరంతా వినపడేలాగే తనను స్మరించమని ఏ దేవుడూ చెప్పలేదు అన్న మాట వాస్తవం. అలాంటప్పుడు ఆ భక్తిని ప్రదర్శించాల్సిన అవసరం, ఎవరికైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఏముంది? మన సమాజంలో ఒక్కొక్క వర్గం వారు ఒక్కొక్క దేవుడిని నమ్ముతున్నారు. అలాగే ఏ దేవుడినీ నమ్మనివాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. అలాంటప్పుడు లౌడ్ స్పీకర్ల భక్తితో ఇబ్బందిపడేవాళ్ళు ఉండరా? అన్నింటికీ మించి సౌండ్ పొల్యూషన్ క్రియేట్ చెయ్యడం ఎందుకు? చిన్న పిల్లలు, వృద్ధులు ఎన్ని ఇబ్బందులు పడతారో వీళ్ళకు తెలుసా? ఇక ఏ రెండు మతాల వాళ్ళు అయినా ఇంచుమించుగా సమానంగానో, ఆధిపత్యం చూపించుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్న ప్రదేశాల్లో అయితే ఈ సౌండ్ పొల్యూషన్ వ్యవహారాలు, రెచ్చిపోవడాలు, ఆవేశకావేశాలు మామూలుగా ఉండవు. భక్తి కంటే బలప్రదర్శనే ఎక్కువగా కనిపిస్తుంది. ప్రశాంతంగా మనసులో ధ్యానించుకోమని పవిత్ర గ్రంథాలు చెప్తూ ఉంటే సాటి మనుషుల్ని హింసించేలా ఉన్మాద భక్తిని ప్రదర్శించడం న్యాయమా అని అడిగితే ఉన్మాదుల్లా దాడిచేయడం న్యాయమా? ఆ మాత్రం అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కు కూడా జనాలకు ఉండకూడదా?