రోజు రోజుకీ… ధాతృత్వంలో కొత్త మెట్లు ఎక్కుతున్నాడు సోనూసూద్. అడిగినవాళ్లకూ, అడగనివాళ్లకు సైతం వరాలు కురిపిస్తున్నాడు. తాజాగా కర్నూలు కేంద్రంగా ఓ ఆక్సిజన్ ఫ్లాంట్ ని నిర్మించడానికి రెడీ అయ్యాడు. కర్నూలు జనరల్ ఆసుపత్రికి అనుసంధానంగా ఓ ఆక్సిజన్ ప్లాంట్ నెలకొల్పడానికి సోనూసూద్ ముందుకొచ్చాడు. దీని విలువ దాదాపు 3 కోట్లరూపాయలు ఉంటుందని సమాచారం. దాదాపు 200 పడకలకు ఈ ప్లాంట్ ద్వారా ఆక్సిజన్ సరఫరా అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్ సోకి, ఆక్సిజన్ అందక చాలామంది రోగులు తమ ప్రాణాల్ని కోల్పోతున్న సంగతి తెలిసిందే. ఈ విపత్తుని గ్రహించిన సోసూసూద్.. ఆక్సిజన్ సిలెండర్ల ఏర్పాటుకు కంకణం కట్టుకున్నాడు. `నాకో మిస్డ్ కాల్ ఇవ్వండి. మీ ఇంటికే ఆక్సిజన్ సిలెండర్ పంపిస్తా` అంటూ తన సేవా దృక్పథాన్ని చాటుకుంటున్నాడు. మాకో ఆక్సిజన్ ఫ్లాంట్ కావాలంటూ జిల్లాలవారిగా సోనూసూద్‌కి విన్నపాలు అందుతున్నాయి. అందులో భాగంగా కర్నూలులో ఆక్సిజన్ ఫ్లాంట్ ఏర్పాటు చేయడానికి సోనూ ముందుకొచ్చాడు.