సోనూ సూద్ సినిమాలలో విలన్‌గా నటించి ఉండవచ్చు కానీ.. నిజ జీవితంలో మాత్రం హీరోగా జీవిస్తున్నారు. వలస కూలీలను సొంత రాష్ట్రాలకు పంపడంలో ఆయన రాజీ పడటం లేదు. వాణిజ్య రాజధాని ముంబైకి సహజంగానే… అన్ని రాష్ట్రాల నుంచి నిరుపేదలు వలస వెళ్తూంటారు. అక్కడే ఉపాధి పొందుతూ ఉంటారు. అలాంటి వారికి ఇప్పుడు ఉపాధి కరవైంది. సొంత ప్రాంతాలకు వెళదామంటే.. వాహనాల్లేవు. దాంతో చాలా మంది కాలినడకన బయలుదేరారు. మీడియాలో.. సోషల్ మీడియాలో వస్తున్న వారి దీనగాధల్ని చూసిన సోనుసూద్ చలించిపోయారు. అలాంటి వారి కోసం ప్రత్యేక బస్సుల్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ముంబైలో.. ఉండి.. సొంత రాష్ట్రాలకు వెళ్లాలనుకుంటున్న కూలీల వివరాలు సేకరించి బస్సుల్ని ఏర్పాటు చేస్తున్నారు. మొదటగా ఆయన కర్ణాటక ప్రభుత్వ అనుమతితో ముంబై నుంచి.. కర్ణాటక కూలీల్ని బస్సుల్లో.. కర్ణాటకకు తరలించారు. ఆ తర్వాత యూపీ ప్రభుత్వ అనుమతి తీసుకుని తన సొంత ఖర్చుతో పెద్ద ఎత్తున బస్సుల్ని ఏర్పాటు చేసి పంపిస్తున్నారు. వలస కూలీల కోసం తాను ఏం చేయగలనో అంతా చేస్తానని చెబుతున్నారు. కరోనా టైంలో సోనూసూద్ సహాయం చేయడం ఇదే మొదటి సారి కాదు. ముంబైలో ఆయనకు ఓ హోటల్ ఉంది.
ఆ హోటల్‌ను ఆరోగ్య శాఖలో పని చేస్తున్న వాళ్లు ఉచితంగా వినియోగించుకునేందుకు ఇచ్చేశారు. అలాగే పంజాబ్‌లో డాక్టర్ల కోసం 1500 పీపీఈ కిట్లు కూడా పంపిణీ చేశారు. బాలీవుడ్ హీరోల్లో సల్మాన్ ఖాన్… సినీ కార్మికులకు నేరుగా నగదు బదిలీ చేయడం.. ఆహార కిట్లు పంపిణీ చేయడం వంటి వాటికి కోట్లు ఖర్చుపెట్టారు. అక్షయ్ కుమార్.. పీఎం కేర్స్‌కు పాతిక కోట్లు ఇచ్చారు. వారి తరహాలోనే సోనూ సూద్.. శక్తికి మించి సేవలు అందిస్తున్నారు. కూలీల మనసుల్లో హీరోగా చోటు సంపాదించుకుంటున్నారు.