మన హీరోల్ని దేవుడిగా చూడడం అబిమానులకు అలవాటే. వాళ్ల కోసం… గుళ్లో పూజలు చేస్తుంటారు. కటౌట్లకు పాలాభిషేకాలు మామూలే. ఇక హారతులు, కొబ్బరికాయ కొట్టడాలూ రొటీన్ వ్యవహారాలు. అయితే చాలా తక్కువ మంది హీరోలకు మాత్రమే గుళ్లు కట్టారు. దేవుడ్ని చేశారు. ఇప్పుడు అలాంటి ఇమేజ్ సోనూసూద్ సొంతమైంది. ఉత్తరాదిన ఒక్కో రోజు, ఒక్కో ఊరిలో సోనూ సూద్ గుళ్లు వెలుస్తున్నాయి. కనీసం దేవుడి గుళ్లో సోనూసూద్ ఫొటోలుపెట్టి, పూజలు చేయడమైనా కనిపిస్తోంది. తెరపై ప్రతినాయకుడిగా నటించిన ఓ నటుడికి… ఇలాంటి గౌరవం దక్కడం బహుశా… భారతీయ చిత్రసీమలో ఇదేతొలిసారి కావొచ్చు.
అయితే ఈ ఇమేజ్ సోనూని కలవరపెడుతోంది. `నేనుఅందుకు అర్హుడిని కాదు.` అని అభిమానులకు చెబుతున్నా – లోలోపల మాత్రం టెన్షన్ పట్టుకుంటోంది. ఎందుకంటే సోనూ ఇమేజ్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఎప్పటిలా విలన్ వేషాలు వేస్తే.. జనం చూస్తారా, లేదా? అనే భయం పట్టుకుంది. ఇది వరకైతే.. ఎలాంటి పాత్ర అయినా చేసేవాడు. ఇప్పుడు ఆచి తూచి ఎంచుకోవాలి. విలన్ వేషాలుకొద్ది రోజులుమానేయాలి. అది…నటుడిగా తనని తాను నియంత్రించుకోవడమే అవుతుంది. దర్శకులలో కూడా.. సోనూని ఇలాంటి పాత్రల్లో చూపించడం కరెక్ట్కాదేమో అనే అనుమానాలు మొదలవుతాయి. సోనూ కి వచ్చిన కొత్త ఇమేజ్ తో ఆయన కోసం పాజిటీవ్ పాత్రలు సృష్టించొచ్చు. రెండు మూడు సినిమాల్లో హీరోగానూ మార్చేయవచ్చు. అయితే… సోనూ దేహాకృతి, శరీర భాష.. విలన్ పాత్రలకు అచ్చుగుద్దినట్టు సరిపోతాయి. కొన్నాళ్లు ఆ పాత్రలకు దూరం కావడం సోనూ.. కెరీర్ని ఇబ్బంది పెట్టే విషయమే.