నటుడు సోనూసూద్ కు అరుదైన పురస్కారం ప్రకటించింది ఐక్యరాజ్య సమితి. ఐరాస అనుబంధ సంస్థ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (యుఎన్‌డిపి) స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్ అవార్డుని ఈ యేట సోనూసూద్‌కి ఇవ్వబోతోంది. లాక్ డౌన్ సమయంలో ప్రజలకు సోనూ చేసిన సహాయానికి గానూ.. ఈ గుర్తింపు దక్కింది.
వలస కార్మికులకు సోనూ ఇచ్చిన చేయూత అంతా ఇంతా కాదు. తన స్వంత ఖర్చులతో వలస కార్మికుల్ని సొంత గూటికి చేర్పించాడు. ఆఖరి వలస కార్మికుడు తన గూటికి చేరేంత వరకూ శ్రమిస్తూనే ఉంటానని ప్రకటించాడు. అనుకున్న విధంగానే చేశాడు. సోషల్ మీడియా ద్వారా తన వరకూ వచ్చిన సమస్యల్ని పరిష్కరించాడు. చాలామందికి అండగా నిలిచాడు. దాంతో.. సోనూ కాస్త రియల్ హీరో అయిపోయాడు. అందుకే.. ఐరాస గుర్తింపు సంపాదించాడు. ప్రజలకు తన చేతనైనంత సహాయం చేశానని, తోటి వారిని ఆదుకోవడం మనిషిగా తన బాధ్యత అనుకున్నానని, అందుకే ఈ పురస్కారం వచ్చిందని తన సంతోషాన్ని పంచుకున్నాడు సోనూ.