లాక్ డౌన్లో హీరో అవతారం ఎత్తేశాడు సోనూసూద్. తన ధాతృత్వంతో లక్షలాది అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. రియల్ హీరో అయిపోయిన సోనూని ఇక మీదట విలన్ పాత్రల్లో చూడగలమా? అనిపించింది అందరికీ. ఇదే డౌటు సినిమా వాళ్లకూ వచ్చేసింది. అందుకే.. ఏకంగా సోనూసూద్ క్యారెక్టర్లే మార్చేస్తున్నారు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం `అల్లుడు అదుర్స్`. ఇందులో సోనూ ప్రతినాయకుడు. లాక్ డౌన్ తరవాత సోనూ ఇమేజ్ మారిన నేపథ్యంలో ఈ సినిమాలోని సోనూ పాత్ర నిడివి పెంచారని ఇంతకు ముందే వార్తలొచ్చాయి. ఇప్పుడు ఏకంగా క్యారెక్టరే మార్చేశార్ట. నెగిటీవ్ పాత్రని కాస్త.. పాజిటీవ్ గా మార్చేశార్ట. ఈ విషయాన్ని సోనూసూద్ స్వయంగా వెల్లడించారు. “ఇప్పుడు నాకన్నీ పాజిటీవ్ పాత్రలే వస్తున్నాయి. `అల్లుడు అదుర్స్`లో ముందు నాది నెగిటీవ్ పాత్ర. ఇప్పుడు పాజిటీవ్ చేసేశారు“ అంటూ అసలు విషయాన్ని లీక్ చేసేశాడు. ఇటీవలే `అల్లుడు అదుర్స్` షూటింగ్ లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చాడు సోనూ. అప్పటి నుంచీ.. సోనూకి దర్శకుల తాకిడి ఎక్కువైంది. ఈ నాలుగు రోజుల్లోనే సోనూ రెండు కొత్త కథలకు పచ్చజెండా ఊపేశాడు.