విజయ్ కుమార్ స్వామికి అద్భుత మహిమలు ఉన్నాయని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు. ఆయన మహిమల మహిమ ఎలాంటిదో వెంటనే అర్థమయిందేమో కానీ సీఎం జగన్ ఆయనకు ఓ పదవి ఇవ్వాలని సంకల్పించారంటున్నారు. ఆయనకు త్వరలో టీటీడీ బోర్డు మెంబర్ పదవి ఇవ్వడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. నిజానికి గతంలోనే పదవి ఇచ్చారు. అయితే ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో చేర్చారు. ఆ ఆహ్వానితుల్ని కోర్టు కొట్టేసింది. దీంతో పదవి లేకుండా పోయింది.
పదవి లేకపోయినా టీటీడీలో విజయ్ కుమార్ స్వామికి తిరుగులేని పట్టు ఉంది. వీఐపీలు వస్తే ఆయనే మొత్తం చూసుకునేవారు. అంతకు ముందు ఈ విజయ్ కుమార్ స్వామి ఎవరో ఎవరికీ తెలియదు. వీఐపీలతో ఉండే ఫోటోల్లో ఆయన ఎవరో టీటీడీ ఉన్నతాధికారి అనుకునేవారు. కానీ ఇప్పుడు ఆ విజయ్ కుమార్ గురించి బయటకు తెలిసే సరికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అసలు టీటీడీలో ఏ పదవి లేని వ్యక్తి వీఐపీల దగ్గరకు ఎలా వెళ్లాడనేది ఎవరికీ తెలియదు. అంతా పెద్దల మాయ అని సరి పెట్టుకున్నారు.
ఇప్పుడు ఆ విజయ్ కుమార్ స్వామి ఎవరో అందరికీ తెలిసిపోయింది. నిబంధనలకు విరుద్ధంగా ఆయనను లోపలకు పంపలేరు. అందుకే ఆయనకు టీటీడీ బోర్డు పదవి ఇవ్వాలని జగన్ నిర్ణయించారని అంటున్నారు. ఇప్పటికే టీటీడీ బోర్డుకు బీసీలకు ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. నాలుగేళ్లకుపైగా వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్నారు. చివరి ఏడాదిలో బీసీలకు ఇస్తే బీసీలకు ఇచ్చామని చెప్పుకోవడానికి ఉంటుందని అంటున్నారు. బహుశా కొత్త బోర్డులోనే విజయ్ కుమార్ స్వామిని బోర్డు సభ్యుడిగా నియమించే అవకాశం ఉందని భావిస్తున్నారు.