ఈ పాట‌తో మ‌ళ్లీ పుట్టిన సిరి వెన్నెల‌

క‌ళ గొప్ప‌తనం ఇదే. మ‌నిషి లేక‌పోయినా.. వాళ్ల మ‌నుగ‌డ ఉంటుంది. వాళ్ల ఆలోచ‌న‌లు మ‌న చుట్టూ తిరుగుతుంటాయి. వాళ్ల ఊసులేవో ఇంకా చెబుతూనే ఉంటాయి. సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి ఈ లోకాన్ని వ‌దిలి చాలాకాలమైంది. ఆయ‌న స్మృతులు, శ్రుతులు ఇంకా మ‌న మ‌ధ్యే ఉన్నాయి. ఆయ‌న పాట‌లు వింటున్న‌ప్పుడో, ఆయ‌న మాట‌లు గుర్తొస్తున్న‌ప్పుడో చ‌టుక్కున మ‌న మ‌ధ్య ప్ర‌త్య‌క్ష‌మైపోతున్నారాయ‌న‌. ఆ పాత సిరివెన్నెల మ‌ళ్లీ కురుస్తోంది. అయితే ఇప్పుడు ఓ కొత్త పాట‌తో… సాక్షాత్తూ సిరివెన్నెల మ‌ళ్లీ పుట్టేశారు.

కృష్ణ‌వంశీ – రంగ‌మార్తాండ‌లో `పువ్వై విరిసే ప్రాణం.. పండై మురిసే ప్రాయం` పాట శ్రోత‌ల ముందుకు వ‌చ్చింది. సీరారామ‌శాస్త్రి రాసిన ఆఖ‌రి పాట‌ల్లో ఇదొక‌టి. స్వ‌ర‌జ్ఞాని ఇళ‌య‌రాజా స్వ‌ర ప‌రిచి, స్వ‌యంగా ఆల‌పించిన పాట ఇది. ఇళ‌య‌రాజా చాలా అరుదుగా పాడుతుంటారు. పాట తాలుకూ సాహిత్యం, సంద‌ర్భం త‌న గుండెల్లో ఇంకిపోతే త‌ప్ప‌.. గొంతు విప్ప‌రు. ఈ పాట ఆయ‌నే పాడారంటే, ఎంత న‌చ్చి ఉంటుందో అర్థం చేసుకోవొచ్చు.

పువ్వై విరిసే ప్రాణం
పండై మురిసే ప్రాయం
రెండూ ఒక‌టే నాణానికి బొమ్మా బొరుసంతే
తీసే ఊపిరి ఒక‌టేగా వేషం వేరంతే.. అంటూ పిల్ల తుమ్మెర‌లా మొద‌లైన పాట ఇది.

న‌డ‌కైనా రాని పసి పాదాలే అయినా
బ‌తుకంతా న‌డిచి అల‌సిన అడుగులే అయినా
చెబుతాయా చేరే మ‌జిలీ ఏదో… అన్న చోట అస‌లైన శాస్త్రి ఇజం బ‌య‌ట‌కు వ‌స్తుంది. మ‌నిషిగా ఎంత అనుభ‌వం సంపాదించుకొన్నా… చేరే చివ‌రి చోటేదో… నీకెలా తెలుస్తుంది? అదంతా విధాత రాత‌.. అని ఒక్క మాట‌లో చెప్పేశారాయాన‌.

రంగ‌మార్తాండ రంగ‌స్థ‌లం నేప‌థ్యంలో సాగే క‌థ‌. ఇందులో పాత్ర‌లు, పాత్ర‌ధారులు.. అంతా వేష‌ధారులే! క‌థ‌లోని కోర్ పాయింట్‌ని పాట‌లోకి తీసుకురావ‌డం సీతారామ‌శాస్త్రికి బాగా అల‌వాటు. ఎన్నో వేల‌సార్లు ఆయ‌న చేసిన మ్యాజిక్‌.. ఈ పాట‌లోనూ రిపీట్ అయ్యింది.

ఒక పాత్ర ముగిసింది నేడు..
ఇంకెన్ని మిగిలాయో చూడు..
న‌డిపేది పైనున్న వాడూ..
న‌టుడేగా న‌రుడ‌న్న వాడూ..
తాను కూడా ప్రేక్ష‌కుడ‌వుతాడూ.. – ఈ చ‌ర‌ణంలో… జీవిత సారం మొత్తం విప్పేశారు.

రంగ‌స్థ‌లంపై న‌టుడే కాదు, జీవితమ‌నే నాట‌కంలో మ‌నిషి కూడా రోజుకో పాత్ర వేయాల్సిందే. ఒక పాత్ర ముగిస్తే.. మ‌రో వేషం క‌ట్టాల్సిందే. ఈ చ‌ర‌ణం సారం కూడా అదే.

ఈ పాట‌కు చివ‌రి మాట‌.. మ‌కుటం లాంటిది. సీతారామ‌శాస్త్రి ప్ర‌తీ పాట‌లోనూ, మాట‌లోనూ లోతైన ఫిలాస‌ఫీ ఉంటుంది. మ‌ళ్లీ మ‌ళ్లీ వందేళ్లు రోజూ స‌రికొత్తే
ఎప్ప‌టికైనా తెలిసేనా బ‌త‌క‌డ‌ముంటంటే..? – అంటూ ముగించారు పాట‌ని. ఎన్ని వేషాలేసినా, ఎన్ని రంగులు అద్దుకొన్నా.. బ‌త‌క‌డం అంటే తెలిసిన‌ప్పుడే మ‌నిషి పుట్టుక‌కు సార్థ‌క‌త‌. మ‌రో వందేళ్లు ఇచ్చినా… ఆ మ‌ర్మం మ‌నిషికి అర్థం కాదు. ఈ పాట తాలుకూ, ఈ క‌థ తాలుకూ త‌త్వం ఇదే. దాన్ని సీతారామ‌శాస్త్రి అక్ష‌ర‌బ‌ద్దం చేశారు.

ఈమ‌ధ్య చాలా పాట‌లొస్తున్నా.. ఇంకోసారి వినాల‌న్న కుతూహ‌లం, ఆస‌క్తి ఏ పాటా ఇవ్వ‌డం లేదు. చాలా కాలం త‌ర‌వాత‌.. రిపీట్ మోడ్‌లో వినాల‌నిపిస్తున్న పాట ఇది. పాట‌కు ప్రాణం పోసింది సీతారామ‌శాస్త్రి, ఇళ‌య‌రాజా అయినా.. ఇంత‌టి అంద‌మైన సంద‌ర్భం సృష్టించిన రంగ‌మార్తాండ సూత్ర‌ధారి కృష్ణ‌వంశీకే ఈ క్రెడిట్ ద‌క్కుతుంది. ఆయ‌న మార్క్ సినిమా చూడాల‌ని అభిమానులు ఎప్ప‌టి నుంచో ఆశ ప‌డుతున్నారు. బ‌హుశా.. ఆ నిరీక్ష‌ణ‌కు రంగ‌మార్తండ తెర దించుతుందేమో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.