మోహన్ బాబు ఇప్పుడు అందరికీ సాఫ్ట్ టార్గెట్ అయ్యారు. ఆయన కుటుంబ సమస్యలను పరిష్కరించుకోలేక దాన్నో సర్కస్ మాదిరిగా చేసుకోవడంతో ఇప్పుడు ఆయన ఆస్తులపై రకరకాల పుకార్లు పుట్టిస్తున్నారు కొంత మంది ఔత్సాహికులు. జల్ పల్లిలోని ఆయన నివాసం అసలు సౌందర్యదని మోహన్ బాబు లాక్కున్నారని ప్రచారం చేయడం ప్రారంభించారు. మోహన్ బాబు, మనోజ్ వివాదం అంతా ఆ జల్ పల్లి నివాసంలో జరగడంతో విపరీతంగా ఆ నివాసంపై ప్రచారం జరిగింది. అయితే లోకులు కాకులు అనుకున్నారో.. తాము స్పందిస్తే ఇంకా పెద్దది చేస్తారని అనుకున్నారో కానీ మోహన్ బాబు టీం ఇంత వరకూ వాటిపై స్పందించలేదు.
అయితే ఖమ్మంకు చెందిన ఓ వ్యక్తి ఈ ప్రచారాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని మోహన్ బాబుపై ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మీడియాలోనూ హాట్ టాపిక్ అయిది. ప్రమాదం కారణంగా సౌందర్య మరణించలేదని, ఆవిడను మోహన్ బాబు హత్య చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదేదో తేడాగా ఉందని అనుకుటున్న సమయంలో సౌందర్య భర్త రఘు వెంటనే స్పందించారు. మోహన్ బాబుతో చాలా కాలంగా పరిచయం ఉందని వారితో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు నిర్వహించలేదని .. ఆస్తుల లావాదేవీలు కూడా నిర్వహించలేదని ఆయన లేఖ విడుదల చేశారు.
సౌందర్యకు సంబంధించిన ఆస్తులు వేటినీ మోహన్ బాబు కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ సొంతం చేసుకోలేదని రఘు స్పష్టం చేశారు. సౌందర్యకు, మోహన్ బాబు కుటుంబానికి మధ్య ఎటువంటి ల్యాండ్ డీలింగ్స్ జరగలేదని ఆయన వివరించారు. సౌందర్యతో పాటు తన అత్త గారు, బావ మరిదితో మోహన్ బాబు కుటుంబం చాలా స్నేహంగా ఉంటారని, ఒకరిపై మరొకరికి పరస్పర గౌరవం ఉందన్నారు. మోహన్ బాబు అంటే తనకు ఎంతో గౌరవం అని, ఆయన మీద నిరాధారమైన వార్తలు రావడంతో తాను ఈ లేఖ విడుదల చేయవలసి వచ్చిందని సౌందర్య భర్త రఘు పేర్కొన్నారు.