సూపర్‌స్టార్ రజనీకాంత్ రెండో కుమార్తె, ‘విక్రమ సింహ’ (తమిళ ‘కొచ్చాడియాన్’కి తెలుగు అనువాదం), ‘వీఐపీ-2’ చిత్రాల దర్శకురాలు సౌందర్య రజనీకాంత్ వచ్చే ఏడాది జనవరిలో పెళ్లి చేసుకోనున్నారని సమాచారం. తమిళంలో రెండు మూడు చిత్రాల్లో నటించిన పారిశ్రామికవేత్త విశాకన్తో సౌందర్యకు నిశ్చితార్థం ఇటీవల జరిగిందని చెన్నై టాక్. ఆమెకు ఇది రెండో పెళ్లి. విశాకన్కూ రెండో పెళ్లే. అందుకని, హంగు ఆర్భాటాలు లేకుండా నిశ్చితార్థ వేడుక జరిపారని చెన్నై సినీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. వ్యాపారవేత్త అశ్విన్‌తో ఏడేళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ 2017లో సౌందర్య రజనీకాంత్ విడాకులు తీసుకున్నారు. అశ్విన్, సౌందర్య కుమారుడు వేద్ ప్రస్తుతం తల్లి వద్దే ఉంటున్నాడు. విశాకన్, సౌందర్య వివాహం తరవాత కూడా వేద్ తల్లి వద్ద పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నటుడిగా విశాకన్‌కు గుర్తింపు రాకున్నా… వ్యాపార పరంగా పేరుందట! చెన్నైలో ఒక ఫార్మాస్యూటికల్స్ కంపెనీ నడుపుతున్న అతను, డీఎంకే పార్టీకి చెందిన మాజీ మంత్రి పొన్ముడి బంధువు కూడా!