ఇస్రో మాజీ ఛైర్మన్ కస్తూరి రంగన్ సమర్పించిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2019 ముసాయిదా నివేదిక తీవ్ర వివాదానికి దారి తీసింది. 3 నుంచి 8 ఏళ్ల లోపు పిల్లలు వివిధ భాషలను సులువుగా నేర్చుకోగలరని, వారికి మూడు భాషలను పరిచయం చేయాలని ముసాయిదా నివేదికలో సూచించారు. దీంతో దేశవ్యాప్తంగా విద్యావిధానంలో మార్పులు రావాలని పాఠశాలల్లో హిందీతో కలిపి మూడు భాషలు ఉండేలా విధానాలు రూపొందించాలని కేంద్రం ప్రతిపాదించింది. సరిగ్గా అక్కడే వ్యతిరేకత వ్యక్తమైంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ప్రజలు దీన్ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు.చివరికి వెనక్కి తగ్గారు.
హిందీ రుద్దడంపై దక్షిణాది తిరుగుబాటు..!
తమిళనాడు, కేరళ, కర్ణాటక, బెంగాల్, మహారాష్ట్రాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కేంద్రం ప్రతిపాదనపై తమిళనాడులో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. తమపై హిందీని బలవంతంగా రుద్దితే సహించమని డీఎంకే అధినేత ఎక్ స్టాలిన్, కర్ణాటక సీఎం కుమార స్వామి, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కేరళ సీఎం విజయన్ హెచ్చరించారు. వీరితో పాటు వివిధ రాజకీయ పార్టీల నేతలు, విద్యావేత్తలు, రచయితలు ఇలా పలు రంగాలకు చెందిన వారు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. త్రిభాషా సూత్రాన్ని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకించారు. హిందీని బలవతంగా రుద్దడం అంటే… తేనెతుట్టెపై రాయివేయడమేనని కేంద్రాన్ని హెచ్చరించారు.
వెంటనే మార్పులు చేసిన కేంద్రం..!
దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పార్టీలతో పాటు… మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన, శివసేన కూడా కేంద్రం ప్రతిపాదనను వ్యతిరేకించాయి. హిందీ తమ మాతృభాష కాదని, దాన్ని తమపై రుద్దే ప్రయత్నాలు చేయొద్దని… మహారాష్ట్ర నవ నిర్మాణ సేన కేంద్రానికి స్పష్టం చేసింది. దక్షిణాది రాష్ట్రాల వారు హిందీ నేర్చుకుంటారు కానీ… ఉత్తరాదిన ఉండేవారు తమిళం, మళయాళం నేర్చుకుంటారా అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనిపై ఆయన వరుస ట్వీట్లు చేశారు. దీంతో కేంద్రం దిగివచ్చింది. ఇదే అంశంపై భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పందించారు. ఏ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము నిర్ణయాలు తీసుకోమని స్పష్టం చేశారు. రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకుని నూతన విద్యా విధానానికి సవరణలు చేస్తామని స్పష్టం చేశారు.కొత్తగా అనుకుంటున్న విద్యా విధానాలు ఇపుడప్పుడే అమలు చేసేది లేదని… ప్రజాభిప్రాయ సేకరణ తరువాతే అమలు చేయాలా? వద్దా? అనేది నిర్ణయిస్తామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఆమె తమిళంలో ట్వీట్ చేశారు. అంతేకాదు ప్రాచీన భాష అయిన తమిళానికి కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తుందని ఆమె ట్వీట్ చేశారు.
హక్కులు, ప్రయోజనాల కోసం దక్షిణాది చూపించాల్సింది ఇదే స్ఫూర్తి..!
వరుస నిరసనలతో కేంద్రం దిగివచ్చింది. ముసాయిదాలో ఉన్న హిందీ తప్పనిసరి అన్న మాటలను తొలగించి సవరించిన ముసాయిదాను విడుదల చేసింది. విద్యార్థుల వెసులుబాటును దృష్టిలో ఉంచుకుని వారు అభ్యసించాల్సిన మూడు భాషల్లో మార్పులు చేసుకోవడానికి ఆరు లేదా ఏడో తరగతిలో అవకాశం ఉంటుందని తాజా ముసాయిదా గుర్తు చేసింది. అయితే వారికి మాధ్యమిక స్థాయిలో నిర్వహించే బోర్డు పరీక్షల్లో ఏదైనా మూడు భాషల్లో ప్రావీణ్యం ప్రదర్శించడం మాత్రం తప్పనిసరి అని తేల్చేసింది. బోర్డు పరీక్షల్లో భాషా నైపుణ్యాల్ని కేవలం ప్రాథమిక అంశాల ఆధారంగానే పరీక్షించే వీలున్న తరుణంలో నాలుగేళ్లలో ఆ నైపుణ్యాల్ని నేర్చుకోవడం సాధ్యమయ్యే విషయమేనని ప్రభుత్వం అభిప్రాయపడింది. బోధనావసతులు అనుకూలించిన పక్షంలో ఆరోతరగతిలో భాషను మార్చుకోవడం విద్యార్థులకు సాధ్యమయ్యే అంశమేనని, అందుకే భాష మార్పునకు సంబంధించిన అదనపు ఐచ్ఛికాలను మాధ్యమిక స్థాయిలో అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం స్పష్టంచేసింది.
దక్షిణాది రాష్ట్రాలు ఇదే స్ఫూర్తితో ఇతర అంశాలపైనా పోరాడితే… హక్కులు, ప్రయోజనాలు కాపాడుకోవడం సులభమే …! కానీ దక్షిణాది నేతలకు ఉండాల్సింది సంకల్పమే.