దక్షిణాదిపై హిందీ భాషను రుద్దే కీలక నిర్ణయం కేంద్రం తీసుకోబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే… నూతన విద్యావిధానంపై ఓ కమిటీ వేసింది. తొమ్మిది మంది నిపుణులో కూడిన ఈ కమిటీ… దేశం మొత్తం హిందీని ఎనిమిదో తరగతి వరకూ తప్పని సరి చేయాలని సూచించినట్లు ప్రచారం జరగుతోంది. ప్రస్తుతం తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గోవా, పశ్చిమ్ బంగ, అసోం వంటి రాష్ట్రాల్లో హిందీ తప్పనిసరి అనే నిబంధన లేదు. కొన్ని పాఠశాలలు మాత్రమే ఈ నిబంధనను అనుసరిస్తున్నాయి. దేశమంతా ఒకే తరహాలో, శాస్త్రీయ కోణంలో విద్యార్థులు విషయాన్ని నేర్చుకొనే లక్ష్యంతోనే జాతీయ విద్యావిధానంలో మార్పులు తేవాలనుకుంటున్నట్లు ప్రభుత్వం వాదిస్తోంది.
దక్షిణాది రాష్ట్రాల్లో హిందీని రుద్దే ప్రయత్నం చేయడంపై గతంలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. తమిళాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఇది తీవ్ర వివాదాస్పదం అయింది కూడా. హిందీని తప్పని సరి చేస్తే.. ప్రాంతీయ భాషలు అస్థిత్వాన్ని కోల్పోతాయనే భావన ఉంది ఉత్తరాదిలో దాదాపుగా అందరూ హిందీ మాట్లాడుతారు. గుజరాతి, మరాఠీ లాంటి భాలకూ.. హిందీకి దగ్గర పోలికలు ఉంటాయి కాబట్టి.. పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ.. దక్షిణాదిలో మాత్రం రాష్ట్రానికో భాష ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ విడిపోయింది కాబట్టి.. రెండు తెలుగు రాష్ట్రాలయ్యాయి. దక్షిణాదిలో హిందీని ప్రాధాన్య భాషగా ఎవరూ పట్టించుకోరు.
ఇలాంటి సమయంలో కేంద్రం.. నూతన విద్యావిధానం అంటూ… హిందీ భాషను రుద్దే ప్రయత్నం చేస్తే… అదో సెంటిమెంట్ వ్యవహారం అయ్యే అవకాశం కనిపిస్తోంది. రాజకీయ పార్టీలు.. ఇప్పుడు భాషా సెంటిమెంట్ ను తీవ్ర స్థాయిలో ప్రయోగిస్తాయి. ప్రజలు కూడా పరాయి భాషను అంగీకరించడానికి సిద్ధపడరు. నూతన విద్యా విధానం తప్పని సరి అనే ఆదేశాలు జారీ చేస్తే మటుకు బీజేపీకి మాత్రం దక్షిణాదిలో మరిన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురవడం ఖాయం.