ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా లక్ష్యం.. తమ పార్టీని దక్షిణాదిలో విస్తరింప చేసుకోవడం. దీని కోసం వారు రాజకీయ మార్గాల్లోనే ప్రయత్నిస్తున్నారు. కులాలు, మతాలు ఈక్వేషన్లతో ప్రయత్నిస్తున్నారు. ముందుగా కర్ణాటకలో అడుగు పెడితే.. ఆ తర్వాత శరవేగంగా అన్ని రాష్ట్రాల్లోనూ విస్తరించవచ్చని ప్రణాళికలు వేసుకున్నారు. అందుకే కర్ణాటకపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. కానీ ఆ పార్టీ వ్యూహలేమితో గెలుపును ఓటమిగా మార్చుకుంది. కర్ణాటకలో అధికారం కోసం బీజేపీ చేసిన రాజకీయం .. దక్షిణాది ప్రజల్లో బీజేపీపై ఉన్న అంతో ఇంతో సానుభూతిని తుడిచి పెట్టేసింది.
దక్షిణాదిలో కనీసం పోటీ పడే స్థాయిలో బీజేపీ ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం కర్ణాటక. గతంలో ఓ పార్టీ ఓ సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పుడూ పూర్తి మెజార్టీ రాలేదు. కానీ ఆపరేషన్ లోటస్‌ను ప్రయోగించి..మెజార్టీ తెచ్చుకుంది. కానీ అవినీతి ఆరోపణలు, పార్టీలో చీలికలతో… అధికారాన్ని కోల్పోయింది.ఈ సారి అన్ని కలిసొచ్చి.. అతి పెద్ద పార్టీగా ఆవిర్భవిస్తే.. అధికారం కోసం.. అడ్డదారులు తొక్కి.. అన్ని రకాల మైనస్‌లు చేర్చుకుంది. చివరికి గెలుకుని ఓటమిగా మార్చుకుంది. కర్ణాటక ఎఫెక్ట్.. దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలపై తీవ్రంగానే పడింది.
ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దక్షిణాదిపై అసలు దృష్టి పెట్టలేదని.. ఏ ఒక్క భారీ ప్రాజెక్టు కూడా.. దక్షిణాదికి ఇవ్వలేదన్న అసంతృప్తి ప్రజల్లో ఉంది. పైగా… పదిహేనో అర్థిక సంఘం విధివిధానాల్లో … దక్షిణాది రాష్ట్రాల సొమ్మును ఉత్తరాదికి పంచేలా ఏర్పాట్లు చేశారు. ఇక ఏపీ వంటి రాష్ట్రాల పట్ల.. ఆ పార్టీ వ్యవహరించిన విధానం, తమిళనాడులో రాజకీయం కోసం.. ఆడిన నాటకాలు.. బీజేపీని దక్షిణాది దరిదాపుల్లోకి కూడా రానీయకూడదన్న భావన ప్రజల్లో పెరిగిపోయింది.
కర్ణాటకలో మాత్రమే లోక్‌సభ సీట్లు గెలుచుకునే సామర్థ్యం ఇప్పుడు బీజేపీకి ఉంది. కాంగ్రెస్-జేడీఎస్ పొత్తు పెట్టుకుంటే.. ఇప్పుడున్న సీట్లలో సగం కూడా వస్తాయన్న గ్యారంటీ లేదు. అదే సమయంలో దక్షిణాదిలో ఏ పార్టీ కూడా నేరుగా బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా లేదు. ఏపీలో వైసీపీ కూడా.. ఎన్నికల తర్వాత మద్దతిస్తాం కానీ.. ముందే పొత్తు పెట్టుకునే పరిస్థితిలో లేదు. ఎన్నికలు ముగిసిన తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే మాత్రమే… ఏ ప్రాంతీయ పార్టీలైనా.. మద్దతిస్తాయి. మోదీ కాకుండా ప్రత్యామ్నాయం ఉందంటే..కచ్చితంగా ఆ పార్టీ వైపే వెళ్తాయి. ఈ పరిణామాలన్నీ చూస్తూంటే.. తమ దూకుడైన…రాజకీయాలతో.. దక్షిణాదిలో అడుగు పెట్టాలన్న ఆశలను.. తామే నలిపేసుకున్నారు బీజేపీ నేతలు.