ఈసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే… దక్షిణాది రాష్ట్రాలే కీలక పాత్ర పోషిస్తాయంటూ వైకాపా వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణాలో పెద్ద సంఖ్యలో కేసీఆర్ కి ఎంపీ సీట్లు రావడం ఖాయం, ఆంధ్రాలో వైకాపాకి కూడా అదే స్థాయి ఫలితాలు రావడం తథ్యం… ఇద్దరూ కలిసి కేంద్రంలో చక్రం తిప్పేస్తారనే అంచనాల్లో ఉన్నారు. భాజపాకి దక్షిణాదిన అవకాశాలు బాగా తగ్గిపోయాయనీ, ఇక్కడ ప్రాంతీయ పార్టీలు కీలకంగా మారాయనీ, ఉత్తరాదిలో కూడా ఆశించిన ఫలితాలు దక్కకపోవచ్చనే విశ్లేషణల్లో వైకాపా వర్గాలున్నట్టు తెలుస్తోంది. ఇవాళ్లి సాక్షి పత్రికలో కూడా దీనికి సంబంధించి ఓ పెద్ద విశ్లేషణాత్మక కథనం కూడా రాశారు.
2004, 2009లో ఢిల్లీలో యూపీయే ప్రభుత్వాన్ని రెండుసార్లు నిలబెట్టింది దివంగత వైయస్సార్ అని అంటున్నారు. నాడు 33 మంది ఎంపీ అభ్యర్థులు గెలిపించుకుని, ఢిల్లీలో కీలకమయ్యారన్నారు. అది వాస్తవమే. అయితే, ఇప్పుడు చర్చ ఏంటంటే… రాష్ట్రం ఉమ్మడిగా లేదు. తెలంగాణాలో తెరాసకి, ఏపీలో వైకాపాకి ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయో స్పష్టత లేదు. పైగా, కేసీఆర్ ప్రతిపాదిత భాజపాయేతర కాంగ్రెసేతర ఫ్రెంట్ లో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చేవారు ఎవరనే స్పష్టత ఇంకా లేదు. మాయావతిగానీ, మమతా బెనర్జీగానీ, అఖిలేష్ యాదవ్ గానీ, నవీన్ పట్నాయక్ గానీ… ఫెడరల్ ఫ్రెంట్ కి మద్దతుగా మాట్లాడిన సందర్భం లేనే లేదు. తమిళనాడులో ఈసారి డీఎంకే బలంగా కనిపిస్తోంది. ఆ పార్టీ మూడో ఫ్రెంట్ లో చేరే అవకాశం లేదు. కర్ణాటకలో భాజపా వెర్సెస్ జేడీఎస్ కూటమి గట్టిగా పోరాడుతున్నాయి. జేడీఎస్ కూటమికి ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చినా… కేసీఆర్ ప్రతిపాదిత కూటమిలో వారు ఉండే అవకాశాల్లేవని చాలా స్పష్టంగా ఉంది. ఇక, కేరళలో వామపక్షాలు బలంగా ఉన్నాయి. పైగా, శబరిమల వ్యవహారంతో అక్కడ భాజపా మీద మండిపాటుతో ప్రజలున్నారు.
ఈలెక్కన దక్షిణాది నుంచే కేసీఆర్ ప్రతిపాదిత ఫెడరల్ ఫ్రెంట్ కి ఒక్క జగన్ తప్ప…. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న మద్దతు కనిపించడం లేదు. 42 స్థానాలు కేసీఆర్, జగన్ లకు వస్తాయన్నది ప్రస్తుతానికి ఊహాజనిత అంచనా మాత్రమే. రాష్ట్రాల వారీగా చూసుకున్నా, సంఖ్యాపరంగా చూసుకున్నా… మూడో ఫ్రెంట్ ఏర్పాటుకు అనుకూలమైన పరిస్థితులు, ఢిల్లీలో ఒక్క దక్షిణాదే చక్రం తిప్పేస్తుందన్న ఐక్యతా కనిపించడం లేదు. ఎన్నికల ఫలితాల తరువాత, ఏయే పార్టీలకు ఎంతెంత సంఖ్యాబలం ఉందని తేలాక అసలు రంగు బయటపడుతుంది.