ఇవ్వాళ్ళ విజయవాడలో దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశం జరుగబోతోంది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కౌన్సిల్ లో సభ్య రాష్ట్రాలయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, తమిళనాడు, కేరళ, కర్నాటక, పాండిచ్చేరిల మంత్రులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొంటారు. తెలంగాణా తరపున ఆ రాష్ట్ర ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్, హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ పాల్గొన బోతున్నారు. 1956 సం.లో మొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మద్రాసు నుండి విడిపోయినపుడు ఈ దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ ఏర్పాటు చేయబడింది. ఈ కౌన్సిల్ దక్షిణాది రాష్ట్రాలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు వాటి నివారణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టవలసిన చర్యల గురించి చర్చిస్తుంది. అలాగే ఆయా రాష్ట్రాలలో అమలవుతున్న వివిధ సంక్షేమ పధకాలు, ఇతర అంశాల గురించి కూడా చర్చిస్తారు. ఈ సమావేశంలో తీసుకొన్న కీలక నిర్ణయాలను అనుసరించి కేంద్రప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి తన జాతీయ ప్రణాళికను రూపొందించుకొంటుంది.