దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరు ప్రమాదకరంగా ఉందని.. హక్కుల్ని కాపాడుకోవడానికి అన్ని రాష్ట్రాలు ఏకం కావాల్సి ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేరళలో మాతృభూమి మీడియా సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాపాడుకునేదుకు నడుం బిగించాల్సిన సమయం వచ్చిందన్నారు.
దక్షిణాది సమర్థంగా జనాభాను నియంత్రించి, మరింత పకడ్బందీగా సంక్షేమాన్ని అమలు చేసినందుకు శిక్షిస్తున్నారా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నియోజకవర్గాల పునర్విభజనలో అన్యాయం జరిగే అవకాశం కూడా ఉందన్నారు. తెలంగాణను ఈ సదస్సులో రేవంత్ రెడ్డి ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేశారు. తెలంగాణ. రైజింగ్ అనేది నినాదం కాదని విధానమన్నారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల ఉన్న నగరం మాత్రం కోర్ అర్బన్ ఏరియాగా గుర్తించామని నెట్ జీరో లెవల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఫ్యూచర్ సిటీ పేరుతో ఫోర్త్ సిటీ నిర్మిస్తున్నారని.. ఇది ప్రపంచంలోనే ప్రణాళికాబద్దంగా నిర్మించబోతున్న మొదటి నగరం అన్నారు.
తెలంగాణ పదేళ్లలో పాతిక వేల కోట్ల పెట్టుబడులు సాధించలేకపోయిందని.. కానీ తాము వచ్చిన ఏడాదిన్నర కాక ముందు రెండు లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు సాధించామన్నారు. రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కేరళ మీడియా ఇంటర్యూకు ఇచ్చారు. రేవంత్ రెడ్డిని దక్షిణాది ప్రముఖ కాంగ్రెస్ నేతగా గుర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన మాటలకు దేశవ్యాప్తంగా ప్రాధాన్యత లభిస్తోంది.