బాలుని ఏమని వర్ణించాలి? ఆయనలోని ప్రతిభని ఎంతని చెప్పాలి? బాలు ని కేవలం ఓ గాయకుడిగానే చూళ్లేం. ఆయన అంతకు మించి. ఆయనలో సంగీత దర్శకుడు, డబ్బింగ్ కళాకారుడు, నటుడు, నిర్మాత, వ్యాఖ్యాత ఇలా… ఎందరో ఉన్నారు. ఆయన మంచి మిమిక్రీ ఆర్టిస్టు. ఏ హీరోకి పాట పాడితే, ఆ హీరోకి తగ్గట్టు.. గళం విప్పడం బాలుకే సాధ్యం. హీరోల గొంతుల్ని అనుకరించడం ఘంటసాల నుంచి అబ్బిన విద్య. అయితే.. హాస్య నటుల గొంతును అనుకరించి, తన పాటతో కితకితలు పెట్టించే కిటుకు.. బాలుకి బాగా తెలుసు. మిమిక్రీ విద్యతో ఎన్ని పాటలకు విశిష్టత తీసుకొచ్చాడో ? `తాళికట్టు శుభవేళ.. మెడలో మందార మాల` పాట చూడండి. బాలు గొప్పదనం అర్థం అవుతుంది. అల్లు గొంతుని అనుకరించడంలో బాలు తరవాతే ఎవరైనా. అందుకే అల్లుకి పాడిన ప్రతీ పాట హిట్టయ్యింది. డబ్బింగ్ విషయానికొస్తే.. కమల్ లాంటి విశిష్టమైన నటుడికి గొంతు ఇవ్వడం మామూలు విషయం కాదు. ఎందుకంటే.. కమల్ శైలి, స్థాయి వేరు. ఆయన నటనకి మ్యాచ్ అవ్వాలంటే.. అంతే ప్రతిభ ఉన్న నటుడు కావాలి. దాన్ని బట్టి.. బాలులోని నటుడి స్థాయి ఏమిటో అర్థం చేసుకోవొచ్చు. తెలుగు భాషపై అద్భుతమైన పట్టు, ప్రేమ ఉన్న గాయకుడు బాలు. అందుకే ఆయన మైకు పట్టుకుంటే.. ఒక్క ఇంగ్లీషు పదం కూడా కనిపించదు, వినిపించదు. అలాగని మిగిలిన భాషల్ని ఆయన తక్కువ చేయరు. అన్నీ భాషల్లోనూ పాటలు పాడిన గాయకుడు కదా. అందుకే ప్రతీ భాషపై ప్రేమ ఉంది. ఏ రాష్ట్రానికి వెళ్తే, ఆ భాషని, పొల్లు పోకుండా మాట్లాడడం బాలుకి ఇష్టం.