తొలితరం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాదు.. ఈతరం ప్రేక్షకులకు సైతం లెజెండరీ గాయని ఎస్. గాయని గురించి తెలిసే వుంటుంది. ఎనిమిది పదుల వయసులోనూ ఎనిమిదేళ్ల పాప వలే పాడగల నేర్పు ఆమెకు మాత్రమే సొంతం. ఆమె ప్రతిభను మెచ్చి పలు పురస్కారాలు వరించాయి. అయితే… జూన్ 4న ఆమెను వరించబోయే పురస్కారం ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ప్రత్యేకమని చెప్పాలి. ఎందుకంటే… ప్రతి ఏడాది ఆయన పేరుతో అందించే జాతీయ పురస్కారాన్ని ఈ ఏడాది ఎస్. జానకికి అందజేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ బాలు మాట్లాడుతూ “జూన్ 4వ తేదీన నెల్లూరు టౌన్‌హాలులో జరిగే కార్యక్రమంలో జానకమ్మకి అవార్డు అందజేస్తాం. ఆమెను అవార్డుకి ఎంపిక చేసే స్థాయి మాది కాదు. ఆమెకు మా విన్నపం తెలియచేసి స్వీకరించాలని బతిమాలి అంగీకారం తీసుకున్నాం” అన్నారు. గత ఏడాది ఈ అవార్డును గాయని బాల సరస్వతికి అందజేశారు. 2017 నుంచి ఎస్పీ బాలు జాతీయస్థాయి అవార్డు అందజేస్తున్నారు.