జూన్ 4… గాన గంధర్వుడు ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం పుట్టిన రోజు. లెక్క ప్రకారం ఆయన తొలి జయంతి. ఈ సందర్భంగా బాలుని స్మరించుకోవాలనుకుంటోంది చిత్రసీమ. జూన్ 4 ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ 12 గంటలు నిర్విరామంగా ఓ సంగీతోత్సవాన్ని నిర్వహించబోతోంది. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకులు, గీత రచయితలు, నిర్మాతలు, కథానాయకులు, గాయనీ గాయకులు, బాలుతో అనుబంధం ఉన్నవాళ్లంతా పాల్గొంటారు. ఇది లైవ్ పోగ్రాం. ఎవరి ఇంటి పట్టున వాళ్లుంటూ.. బాలు పాటలు పాడుతూ, బాలు స్మృతుల్లో తేలిపోతారు. ఈ రోజుని బాలుకి అంకితం చేయాలని చిత్రసీమ నిర్ణయించుకుంది. బాలు కన్నుమూశాక.. చిత్రసీమంతా కలిసి ఏ కార్యక్రమమూ చేపట్టలేదు. ఆయనకు నివాళి అందించే ప్రయత్నమూ చేయలేదు. కరోనా భయాల వల్ల.. నలుగురూ కలిసి, సంతాపం వ్యక్తం చేసే అవకాశం లేకుండా పోయింది. ఈసారి మాత్రం… చిత్రసీమ కలిసి కట్టుగా ఓ కార్యక్రమం చేపడుతోంది. బాలు అభిమానులకు ఇదో ఊరట.