ప్రముఖ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గత కొన్ని రోజులుగా ప్రాణాలతో పోరాడుతున్న సంగతి తెలిసిందే. కరోనా బారీన పడి, చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేరిన బాలు ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణించడంతో ఆయన్ని ఐసీయూలో చేర్పించారు. ఆ తరవాత.. ఆయన మరింత బలహీన పడ్డారు. వెంటిలేటర్ సహాయంతో ఆయనకు చికిత్స అందించారు డాక్టర్లు. ఆయన స్పృహలోనికి వచ్చి, మనుషుల్ని గుర్తు పట్టడానికే చాలా రోజులు పట్టింది. నిజానికి బాలు.. ప్రాణాలతో పోరాడారు. ఆయన ఆరోగ్యంపై ఇటు అభిమానులతో పాటు అటు డాక్టర్లు కూడా ఆందోళన చెందారు.
అయితే ఇప్పుడు బాలు డేంజర్ జోన్నుంచి బయటపడినట్టు తెలుస్తోంది. ఆయన ఆరోగ్యం పూర్తిగా కోలుకోకపోయినా, ఇప్పుడు ప్రాణాలకు వచ్చిన ముప్పేమీ లేదని వైద్యులు కుటుంబ సభ్యులకు అభయహస్తం అందించారని తెలుస్తోంది. సోమవారం ఓ గుడ్ న్యూస్ చెబుతా అంటూ.. బాలు తనయుడు చరణ్ తెలిపాడు. సోమవారం బాలుని ఐసీయూ నుంచి సాధారణ గదికి డిశ్చార్జ్ చేస్తారని తెలుస్తోంది. మరో వారం పది రోజుల్లో ఆయన వైద్యుల పర్యవేక్షణలోనే ఉంటారు. ఈ నెలాఖరు నాటికి బాలు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి.. ఇంటికి చేరుకుంటారని సన్నిహిత వర్గాలు తెలిపాయి.