దేశంలోని గాయకులంతా ఏకమవ్వబోతున్నారు. తమ హక్కుల కోసం పోరాటం చేయబోతున్నారు. దానికి ప్రముఖ గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం నాయకత్వం వహించబోతున్నారు. టీవీ ఛానళ్లలో, ఎఫ్.ఎమ్లలో విరివిగా పాటలు వస్తుంటాయి. అలా వాడుకుంటున్న ప్రతీ పాటకూ.. గీత రచయితకు, సంగీత దర్శకుడికి కొంత పారితోషికాన్ని చెల్లిస్తారు. పాట పాడిన గాయకుడికి ఎలాంటి క్రెడిటూ దక్కడం లేదు. ఈ విషయమై.. చాలాకాలం నుంచి గాయకులు పోరాడుతూనే ఉన్నారు. కానీ ఫలితం దక్కలేదు. అందుకే ఇప్పుడు గాయకులంతా ఏకమవ్వబోతున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మరాఠీ, హిందీ.. ఇలా అన్ని భాషల గాయకులూ కలసి ఓ అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నారు. అందుకు సంబంధించిన విధివిధానాలను ఈ రోజు హైదరాబాద్లో జరిగే కార్యక్రమంలో మీడియా ముందు ఉంచబోతున్నారు. పాట రాసిన గీత రచయితకు,స్వర పరిచిన సంగీత దర్శకుడికీ, పాడిన గాయకుడికీ క్రెడిట్ ఇస్తే… మరి నిర్మాత సంగతేంటన్నది ముందు నుంచీ ఎదురవుతున్న ప్రశ్నే. ఈ లావాదేవీలలో ఆడియో కంపెనీలు ఎక్కువ లాభపడుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. పాటతో సంబంధం ఉన్న వాళ్లందరికీ పారితోషికాలు వస్తున్నప్పుడు.. ఆ పాటకు మూలకారణమైన నిర్మాతకు కూడా ఎంతో కొంత ఇవ్వాల్సిందే కదా? మరి దీనిపై పోరాటం ఎప్పుడు మొదలవుతుందో?