గాయకుడిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సాధించని ఘనత లేదు. యాభై వేల పాటల్ని పాడారు. గిన్నిస్ బుక్ రికార్డులకు ఎక్కారు. సంగీత దర్శకుడిగానూ ప్రేక్షకుల ముందుకొచ్చారు. నటుడిగానూ మెప్పించారు. ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఆయనకు తీరని కోరిక వుంటుందా? అంటే… ఒక్కటి వుంది. గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా కాదు. నిర్మాతగా ఎస్పీ బాలుకి ఓ తీరని కోరిక వుంది. అదేంటంటే… బాపు దర్శకత్వంలో ఓ సినిమా నిర్మించాలని ఆయన అనుకున్నారు. బాపు దగ్గరకు వెళ్లి అడిగారు కూడా! అయితే… అప్పటికి రమణ కాలం చేశారు. ఎస్పీ బాలు అడగ్గానే… “బ్రహ్మ (రమణ) లేడుగా” అని బాపు సమాధానం ఇచ్చారు. దాంతో బాలు ఆశ నెరవేరలేదు. బాపు దర్శకత్వంలో సినిమా నిర్మించాలనే కోరిక అలాగే మిగిలిపోయింది. కమల్ హాసన్ కోరిక మేరకు, కమల్ ప్రోద్బలంతో నిర్మాత అయ్యానని ఎస్పీ బాలు తెలిపారు. తాజా ఇంటర్వ్యూలో తాను ఎలా నిర్మాతగా మారిందీ ఆయన చెప్పారు. “ఒక రోజు తమ్ముడు కమల్ ఫోన్ చేశాడు. అప్పటికి అన్నయ్య విశ్వనాథ్, కమల్ సినిమా చేసి ఏడేళ్లు అయ్యింది. అన్నయ్య దర్శకత్వంలో సినిమా చేయాలనే కోరికను వెలిబుచ్చాడు. అదీ ఆ సినిమా నేను నిర్మిస్తే బావుంటుందని అన్నాడు. అలా ‘శుభ సంకల్పం’తో నిర్మాతను అయ్యా. ఆ తరవాత చాలామంది కోసం నేను సంతకాలు పెట్టి సినిమాలు చేశా. వచ్చిన డబ్బులు వాళ్లకు ఇవ్వడం ఎందుకని సినిమాలు నిర్మించడం మానేశా. కానీ, బాపుగారితో సినిమా చేయాలనే కొరికతో ఆయన్ను అడిగా. ‘బ్రహ్మా (రమణ) లేడుగా’ అన్నారు. దాంతో నా కోరిక మిగిలిపోయింది” అని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.