ప్రముఖ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం కాస్త కుదుట పడింది. ఈ విషయాన్ని ఆయన తనయుడు చరణ్ తెలిపారు. ఆయన బాలు ఆరోగ్య పరిస్థితిపై ప్రతీ రోజూ ఓ వీడియో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. “డాక్టర్లు నిన్నటి వరకూ `క్రిటికల్` అనే పదాన్ని వాడారు. ఇప్పుడు `స్టేబుల్` అంటున్నారు. వైద్యానికి ఆయన బాగా స్పందిస్తున్నారు. అయితే… ప్రమాదం తప్పిందని కాదు. ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సివుంది. డాక్టర్లపై మాకు పూర్తి నమ్మకం ఉంది. మీ ప్రార్థనలు ఫలిస్తాయి“ అన్నారు. ఈనెల 5న కరోనా సోకి బాలు ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. క్రమంగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. బాలు కోసం విదేశాల నుంచి ప్రత్యేక వైద్య బృందం వచ్చింది. వాళ్ల పర్యవేక్షణలో బాలుకి చికిత్స అందుతోంది.