సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి
ఉత్తర ప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం.. సమాజ్‌వాదీ పార్టీ చీలిక దిశగా పయనిస్తోంది. బాబాయ్-అబ్బాయ్‌ల మధ్య గొడవ ముదిరి పాకాన పడింది. దీనిని చక్కదిద్దడానికి పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ చేస్తున్న ప్రయత్నాలు సఫలమయ్యే సూచనలు కనిపించడం లేదు. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆదివారం నాడు తీసుకున్న చర్య దీన్ని ఎగదోసేలానే ఉంది. బాబాయ్ శివపాల్ యాదవ్ సహా నలుగురు మంత్రుల్ని ఆయన మంత్రివర్గం నుంచి తొలగించారు. ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన సినీ నటి జయప్రదను యూపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవి నుంచి తొలగించారు. సమాజ్ వాదీ నేత అమర్‌సింగ్‌కు సన్నిహితురాలైన జయప్రద రాంపూర్ నియోజకవర్గ మాజీ ఎంపీ. సినీ రంగాన్ని విడిచిపెట్టిన అనంతరం ఆమె అమర్‌సింగ్ పంచన చేరారు.
ఎన్నికల వేళ యూపీలో ముదిరిన ఈ సంక్షోభం పార్టీ చీలికకు దారితీస్తున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అఖిలేశ్ వందమంది ఎమ్మెల్యేలతో వేరు కుంపటి పెట్టుకోవడానికి సిద్ధమై పోతున్నారు. ఆదివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు కూడా. 30మంది ఎమ్మెల్సీలు కూడా ఇందులో పాల్గొన్నారు. మరోవంక శివపాల్ యాదవ్ తన అన్న ములాయం సింగ్ యాదవ్‌తో సమావేశమయ్యారు. కీలకమైన తరుణంలో అనారోగ్యకరమైన ఈ పరిణామం వెనుక బీజేపీ ఉందని మెటికలు విరుస్తున్నవారూ లేకపోలేదు. ఇదే తరుణంలో కాంగ్రెస్ నుంచి రీటా బహుగుణ భారతీయ జనతా పార్టీలో చేరడం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. తాజా పరిణామాలు చూస్తుంటే బీహార్ గుర్తుకొస్తోంది. సరిగ్గా ఇదే తరుణాన ఆ రాష్ట్రంలో మాంఝీని బీజేపీ రెచ్చగొట్టింది. వేరు కుంపటి పెట్టించింది. ఎన్ని ఎత్తులు వేసినా పారలేదు. ఎన్నికలలో చావుదెబ్బతింది. ఆ అనుభవమో ఏమో కీలకమైన యూపీలో జాగ్రత్తగా పావులు కదుపుతోంది. తన ప్రమేయం కనిపించకుండా జాగ్రత్త పడుతోంది.