అంతరిక్ష శకలాల వల్ల భూమికి ఎప్పడు ఏతరహాలో ముప్పువాటిల్లుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. గ్రహశకలాలు, మానవనిర్మిత శకలాలు మనకు ఏదోరకంగా టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఓ చిన్న మానవ నిర్మితమైన ఉపగ్రహం లేదా రాకెట్ శకలం భూమిని ఢీకొట్టడానికి సిద్ధంగాఉన్నదట. శాస్త్రవేత్తల అంచనాప్రకారం నవంబర్ 13వ తేదీ (శుక్రవారం) ఈ శకలం భూమిని ఢీకొట్టబోతున్నది.
ఇప్పటికే ఈ వార్తపై అనేక వదంతులు వ్యాపిస్తున్నాయి. రెండుమూడు రోజుల క్రిందట ఒక విచిత్ర వస్తువు భూమిని ఢీకొట్టబోతున్నదంటూ వార్తలొచ్చాయి. ఇది భూమికి అతి చేరువలో ఉన్నదనీ, మరో కొద్దివారాల్లోనే అది భూమిని ఢీ కొట్టబోతున్నదంటున్నారు. అంతేకాదు, దీనివల్ల అపారనష్టం కలగొచ్చంటూ మీడియాలో వార్తా కథనాలు కూడా వచ్చాయి. దీంతో భయాందోళనలు ఎక్కువయ్యాయి.
గతంలో కూడా ఇలాంటి కథనాలను మీడియా మోసుకొచ్చింది. మూడేళ్ల క్రిందట (2012)లో అతిపెద్ద గ్రహశకలం భూమిని ఢీకొంటుందనీ, దీంతో భూమికి పెనుముప్పు తప్పదంటూ తేల్చిపారేశారు. ఈ అంశంపై హాలివుడ్ లో సినిమా కూడా తీశారు. చివరకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండానే 2013లోకి ప్రవేశించాం. సరిగా అదే ఏడాది మరో శకలాన్ని గుర్తించడం జరిగింది.
శాస్త్రవేత్తలు మొదట్లో దీన్ని సరిగా గుర్తించలేకపోయారు. 2013 ఫిబ్రవరి 18న తొలిసారిగా ఇది కనిపించి అంతలో మాయమైంది. మళ్ళీ ఇప్పుడు అందరికీ దడపుట్టిస్తోంది. మొదట్లో ఇదేదో గ్రహాంతరవాసుల వాహనమైఉంటుందనీ, ఇందులో గ్రహాంతరవాసులు ఉండవచ్చన్న ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే, శాస్త్రవేత్తలు దీని ఉనికిని అదే సంవత్సరం (2013) నవంబర్ 29న గుర్తించారు. ఇంకాస్త స్పష్టంగా క్రిందటి నెలలో (అక్టోబర్ 3) దీని ఆనుపానులు గమనించారు. ఇదేమీ గ్రహాంతరవాసుల వాహనం కాదనీ, మానవ నిర్మిత రాకెట్ లేదా శాటిలైట్ లోని ఒక శకలమని తేల్చిచెప్పారు.
మూడు నుంచి ఆరు అడుగుల వెడల్పుతో ఉన్న ఈ శకలం వచ్చేనెల 13వ తేదీన హిందూమహాసముద్రంలో పడొచ్చని అంటున్నారు. ఈ శకలం భూమిని ఢీకొట్టడం వల్ల పెద్ద ప్రమాదమేమీ ఉండదట. శ్రీలంకకు దక్షిణాన వందకిలోమీటర్ల దూరంలో హిందూమహాసముద్రంలో ఆరోజు ఉదయం జిఎంటీ ప్రకారం 6-19 నిమిషాలకు (ఐఎస్ టి – ఉ. 11-49) ఈ శకలం సముద్రప్రాంతంలో కూలిపోవడం మాత్రం ఖాయం.
అయితే, ప్రస్తుతం అంతరిక్షంలో భూమికి చేరువగా పరిభ్రమిస్తున్న ఈ శకలం యధాతథంగా సముద్రంలో పడిపోదు. ఇది పరిమాణంలో చాలా చిన్నది కావడంతో భూవాతావరణంలోకి ప్రవేశించగానే తీవ్రఒత్తిడికి గురై మండిపోతుంది. ఒకవేళ శకలంలోని సూక్షభాగాలు (సెంటీమీటర్ పరిమాణంలో ఉండేవి) క్రిందకు పడిపోయినప్పటికీ, ఎలాంటి ప్రాణహాని, లేదా ఆస్తినష్టం కానీ ఉండదని శాస్త్రవేత్తలు అంటున్నారు. కాకపోతే అది పతనం చెందే సమయంలో పట్టపగలైనప్పటికీ దాని వెలుగు కొద్ది సెకన్లపాటు వినీలాకాశంలో కనబడే అవకాశం ఉంది. ఈ శకలానికి WT1190F అని పిలుస్తున్నారు.
అంతరిక్షం నుంచి ఏ శకలం నేలరాలినా అది సాధారణంగా సముద్రజలాల్లోనే పడిపోయే అవకాశం ఉంటుంది. దీనికి ప్రధాన కారణం, భూమిపై మూడొంతులు నీళ్లు ఉండటమే. అంటే, మానవజాతిని ఇలాంటి ప్రమాదల నుంచి ఎక్కువ శాతం రక్షిస్తున్నది సముద్రజలాలేనన్నమాట. అయినప్పటికీ ఏదో భయం మనల్ని వెంటాడుతూనే ఉంది. ఏ గ్రహశకలమో భూమిని ఢీకొంటుందనీ, అప్పుడు మానవజాతి అంతమవుతుందన్నదే ఆ భయం. అదే అనేక ఊహాగానాలకు అవకాశమిస్తోంది. మీడియాకు కూడా…
– కణ్వస