ఏపీ సర్కార్.. తమకు వ్యతిరేకం అనుకున్న మీడియాను.. అసెంబ్లీ గేటు దగ్గరకు కూడా రానీయకూడదని గట్టి పట్టుదలగా ఉంది. అసెంబ్లీ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలు.. మూడు చానళ్లకు నిరాకరిస్తూ.. స్పీకర్ నిషేధం విధించారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 5, ఈటీవీ ఆంధ్రప్రదేశ్ చానళ్లలో అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలు రావడం లేదు. కనీసం.. ఐ అండ్ పీఆర్ ఇచ్చే.. లైవ్ ఫుటేజీని కూడా వాడుకోకూడదని.. అసెంబ్లీ స్పీకర్ ఆదేశింశారు. అంతే కాదు.. ఆయా చానళ్ల ప్రతినిధులు.. అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా.. చేశారు. నిషేధం విధించేంత తప్పు ఏం చేశారని.. చాలా మందికి మొదట్లో ఆశ్చర్యం వేసింది. కానీ అది ఇప్పటి తప్పు కాదట.. గత అసెంబ్లీ సమావేశాల్లో.. ఆ మూడు చానళ్లు .. తప్పు చేశాయట.
గత అసెంబ్లీ సమావేశాల సమయంలో.. అసెంబ్లీ జరుగుతూండగా.. అచ్చెన్నాయుడు బయట మీడియా పాయింట్లో మీడియాతో మాట్లాడారు. 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్న జగన్ హామీపై.. ఆందోళన చేసినందుకు.. అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడులను స్పీకర్ సస్పెండ్ చేశారు. సస్పెండై బయటకు వచ్చిన అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. అప్పుడు మీడియా చానళ్లు.. లైవ్ ఇచ్చాయి. అయితే అసెంబ్లీ రూల్స్ పై స్పష్టమైన అవగాహన లేని… చానళ్ల సిబ్బంది.. ఓ నిమిషం పాటు.. అసెంబ్లీ లైవ్ ఆపి… అచ్చెన్నాయుడు లైవ్ ఇచ్చారు. అసెంబ్లీ జరిగేటప్పుడు.. బయట మీడియా పాయింట్ లైవ్ ఇవ్వకూడదని ఉన్న నిబంధన చూపి.. మూడు చానళ్లపై బ్యాన్ వేశారు. నిజానికి ఇతర చానళ్లు కూడా ఈ లైవ్ ఇచ్చినా.. అవి అస్మదీయ చానళ్లు కాబట్టి బ్యాన్ జాబితాలో చేర్చలేదు.
నిజానికి అది చాలా చిన్న తప్పు. ఆ విషయం స్పీకర్ కూడా చెప్పారు. మీడియా ప్రతినిధులు చేసిన విజ్ఞప్తిని పరిశీలిస్తామని కూడా చెప్పారు. అది ఒక్క రోజుకో.. రెండు రోజులకో పరిమితం కావాల్సిన బ్యాన్‌ను తర్వాతి సమావేశాలకూ పొడిగించారు. నిజానికి.. మీడియాపై.. ఇంత చిన్న నిబంధన పేరుతో… చర్యలు తీసుకోవడం ఉమ్మడి రాష్ట్రంలోనూ జరగలేదు. మహా అయితే.. వివరణ తీసుకుంటారు. తెలుగుదేశం పార్టీ హయంలో… సాక్షి మీడియా గ్రూప్.. ఏకంగా అసెంబ్లీపైనే ఎన్నో అభ్యంతరకమైన రాతలు రాసింది. స్వయంగా స్పీకర్ పైనే.. అనుచితమైన వ్యాఖ్యలు సాక్షి మీడియాలో వచ్చిన సందర్భాలున్నాయి. కానీ ఎప్పుడూ కూడా మీడియా.. అనే గౌరవంతోనే… స్పీకర్ సాక్షిని అసెంబ్లీలోకి రాకుండా.. అడ్డుకోలేదు. ఎలాంటి చర్యలపై ఆలోచన కూడా చేయలేదు. కానీ దానికి భిన్నంగా… ఇప్పుడు… మూడు చానళ్లను టార్గెట్ గా పెట్టుకుని మరీ అసెంబ్లీ ప్రసారాలపై నిషేధం విధించారు. ఆ నిషేధాన్ని సుదీర్ఘంగా కొనసాగిస్తున్నారు.