స్పీకర్ తమ్మినేని సీతారం.. చైర్లో కూర్చున్నా.. కూర్చోకపోయినా.. ఆయన మాటల తీరు వేరుగా ఉంటుంది. చాలా ఘాటుగా ఉంటుంది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి అలా చేయడంపై.. చాలా మంది విమర్శలు చేస్తున్నా.. ఆయన పట్టించుకోరు. అలా ఎందుకు చేస్తున్నారంటే.. ఆయన ముఖ్యమంత్రి మెప్పు పొందడానికేనని.. అలా పొంది.. కేబినెట్లో చోటు పొందడమేనని.. సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన నేరుగానే చెప్పారు. అచ్చెన్నాయుడుతో.. స్పీకర్.. అటు బీఏసీ సమావేశంలోనూ.. ఇటు అసెంబ్లీలోనూ వాగ్వాదానికి దిగారు. అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతూండగా.. స్పీకర్ పలుమార్లు అడ్డు తగిలారు. కొన్ని వ్యాఖ్యలు చేసారు. ఆ సమయంలో.. మంత్రి పదవి తీసుకొని మాట్లాడాలని స్పీకర్‌కు అచ్చెన్నాయుడు సూచించారు.
ఈ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన స్పీకర్ తమ్మినేని సీతారాం .. నేను మంత్రి పదవి తీసుకుంటా, నీ సంగతి చూస్తా .. కంగారు పడొద్దని హెచ్చరించారు. ఆ సమయంలో.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా సభలోనే ఉన్నారు. అంతకు ముందు అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలనేదానిపై స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలోనూ.. అచ్చెన్నాయుడుతో.. స్పీకర్ వాదన పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి ఎదురుగానే.. ఈ వాదన జరిగింది. శ్రీకాకుళం జిల్లా తీవ్రంగా వెనుకబాటుకు గురయిందని.. విశాఖలో రాజధాని పెట్టడాన్ని శ్రీకాకుళం జిల్లాకు చెందిన అచ్చెన్నాయుడు వ్యతిరేకించడం దుర్మార్గమని స్పీకర్ ఆయనను కార్నర్ చేసే ప్రయత్నం చేశారు.
దీనికి కూడా అచ్చెన్నాయుడు.. ధీటుగా సమాధానం చెప్పారు. ఇరవై ఏళ్ల పాటు శ్రీకాకుళం జిల్లాకు మంత్రులుగా ఉన్నది.. ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాంలేనని.. వారిద్దరూ ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నారని.. వెనుకబాటు తనానికి మంత్రులుగా వారికి బాధ్యత లేదా అని ప్రశ్నించారు. దీంతో స్పీకర్.. అచ్చెన్నతో వాదన అనవసరమని.. ఆయన మారడని చెప్పి…టాపిక్ మార్చేశారు. మొత్తానికి స్పీకర్ తమ్మినేని.. స్పీకర్ పదవితో సంతృప్తిగా లేరు. ఆయన మంత్రి పదవి కోసం.. ముఖ్యమంత్రి జగన్ ను.. ఇంప్రెస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మాత్రం స్పష్టమవుతోందంటున్నారు.