స్పీకర్‌గా ఉన్న వారు సొంత పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనరు. ఎందుకంటే స్పీకర్ కనీసం బయటకు అయినా పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తున్నానని కనిపించడానికి ప్రయత్నించేవారు. అది మొన్నటి వరకే. ఇప్పుడు స్పీకర్ తమ్మినేని సీతారాం అన్ని రకాల అడ్డుగోడుల్ని కూల్చేశారు. తాను ముందు వైసీపీ కార్యకర్తనని.. ఆ తర్వాతే ఎమ్మెల్యే.. స్పీకర్‌నని… అలాంటి తమ పార్టీ పండుగ జరుపుకుంటూంటే రాకుండా ఉంటానా అని ప్రశ్నిస్తున్నారు.
స్పీకర్ పార్టీ వేడుకలో పాల్గొన్నారని కొన్ని మీడియా సంస్థలు ప్రజలకు తెలియచెప్పాయి. ఇదిఆయనకు ఆగ్రహాన్ని కలిగించింది. ఆ మీడియా సంస్థలపై తనకు కోపం వచ్చినప్పుడు మాత్రమే అసువుగా వచ్చే ఇంగ్లిష్తో విరుచుకుపడ్డారు. కులాలు.. మతాలు అంటించి నానా తిట్లు తిట్టారు. ఆ తర్వాతే ఆయన కాస్త శాంతించినట్లుగా ఉన్నారు. స్పీకర్ అలామాట్లాడితే ఆయనను ఎవరూ ఏమీ అనలేరు. ఎందుకంటే..ఆయనను దారుణంగా తిడితే పార్టీ నేతగా తీసుకోరు. స్పీకర్ గారినే తిట్టారంటూ కేసులు పెట్టేస్తారు. గతంలో టీడీపీ నేత కూన రవికుమార్‌పై అలాగే కేసులు పెట్టారు.
చేసేది తప్పు..దాన్ని సమర్థించుకోవడానికి అయితే ఏంటీ అనే వాదనను వైసీపీ నేతలు తీసుకొస్తున్నారు. వారు అధికారంలో ఉన్నారు. ఏం చేసినా తప్పు కాదనే భావనలో ఉన్నారు. ఇప్పటికైతే తప్పు కాదు. ఎందుకంటే.. రాజకీయాల్లో పాటించాల్సిన నైతిక విలువలు అనేవి ఓ ట్రాష్ ఇప్పటికే తేల్చేశారు.ఈ క్రమంలో రాజ్యాంగపరమైన పదవులకూ ఇలాంటి దుస్తితి తీసుకురావడమే చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. గతంలో ఏ స్పీకర్ అలా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోయినా.. పాల్గొన్నారంటూ అవాస్తవాలు ప్రచారం చేస్తూ.. తమదైనరాజకీయం తాము చేసేసుకుంటున్నారు.